గోదావరి వరద బాధితులకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గోదావరి వరద ముంపు బాధితులకు 25 కిలోల బియ్యం, 5 కిలోల కంది పప్పు, కారం, పసుపు, ఉప్పు తదితర నిత్యావసర సరుకులను ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి బాధిత కుటుంబానికి సహాయం అందుతుందని తెలిపారు.సర్వే బృందాలు ఏర్పాటుచేసి, బాధిత కుటుంబాల వివరాలు సేకరించామన్నారు.
పరిస్థితులు అనుకూలించేవరకు పునరావాస కేంద్రాల్లో భోజనం, వసతి ఉంటుందన్నారు.పారిశుద్ధ్య చర్యలు నిరంతరం చేపడుతున్నట్లు, ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.
బ్లీచింగ్ చల్లడం, నిల్వ నీటిలో, డ్రైనేజీల్లో స్ప్రే చేయించడం, యాంటీ లార్వా చర్యలు చేపడుతున్నామన్నారు.జ్వర సర్వే చేపట్టడం, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించి, చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకై వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖలు అప్రమత్తంగా వుంటూ, చర్యలకై సన్నద్ధంగా విధి నిర్వహణలో ఉన్నట్లు ఆయన అన్నారు.
పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి, సహాయక చర్యలకు ఇతర జిల్లాల అధికారులు, సిబ్బంది, మెషినరీ ని సమాయత్తం చేసి, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అంతకుముందు కలెక్టర్ మోతెపట్టినగర్ గ్రామంలో ఐటిసి భద్రాచలం ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు, నిత్యావసర సరుకుల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ తహశీల్దార్ భగవాన్ రెడ్డి, జెడ్పిటిసి శ్రీలత, నాగినేనిప్రోలు సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, మోతేపెట్టినగర్ సర్పంచ్ సూరమ్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.







