ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు కీలక నేత.విశాఖ జిల్లాలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ఇప్పటివరకు గెలుస్తూనే వచ్చారు.2019 ఎన్నికల్లో విశాఖ సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గంటా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు.అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు.
అయితే మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గంటా ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు.
జగన్ హయాంలో దాదాపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరిపై కేసులు నమోదయ్యాయి.గంటాపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.ఆయన జోలికి జగన్ ప్రభుత్వం వెళ్లలేదు.వైసీపీ ప్రభుత్వంతో అనవసరంగా ఇబ్బందులు ఎందుకులే అనుకున్న గంటా కూడా రాజకీయాల్లో మందకొడిగా కనిపించారు.
చివరకు సొంత నియోజకవర్గంలో కూడా గంటా పర్యటించలేదు.ఆయన నమ్మకస్తులు, అనుచరులే పనులన్నీ చక్కపెడుతున్నారు.
నెలరోజుల కిందట టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడులో కూడా పాల్గొనలేదు.
దీంతో గంటా పార్టీలో ఉన్నారా లేదా అని అందరికీ అనుమానాలు వస్తున్న తరుణంలో సడెన్‌గా కొన్నిరోజుల కిందట విశాఖ జిల్లా పరిషత్ సమావేశానికి హాజరయ్యారు.
తాజాగా జిల్లాలవారీగా చంద్రబాబు మినీ మహానాడులు జరుపుతున్నారు.చోడవరం మినీమహానాడులో పాల్గొనేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన చంద్రబాబుకు గంటా స్వాగతం చెప్పే ప్రయత్నం చేశారు.కానీ చంద్రబాబు గంటాను పట్టించుకోలేదు.ఒక చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు.
దీంతో గంటా ఆలోచనలో పడ్డారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న నేతలకు మాత్రమే వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తానని ఇటీవల చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో గంటా పరిస్థితి డోలాయమానంగా మారింది.విశాఖ జిల్లాలో ఇప్పటికే అయ్యన్నపాత్రుడు కీలక నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.దీంతో జిల్లాలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందుగా చంద్రబాబు ఇంటికి వెళ్లిన గంటాను బాబు సాదరంగానే ఆహ్వానించారు.అక్కడినుంచి కలిసే ఇద్దరూ అసెంబ్లీకి వచ్చారు.దీంతో భవిష్యత్‌లో తన ప్రాధాన్యతను పెంచుకోవడానికే గంటా శ్రీనివాసరావు ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







