ఏపీలో వైసీపీ కుటిల రాజకీయాలకు తెరతీసింది.గతంలో పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ ప్రభుత్వం బేషరతుగా మద్దతు ప్రకటించింది.
అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తాము గతంలో బీజేపీకి ఎలాంటి మద్దతు ప్రకటించలేదని.కేవలం రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనే మద్దతు ఇచ్చామని వ్యాఖ్యానించారు.
గిరిజన అభ్యర్థి కాబట్టే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చిందని వివరించారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలనే తిప్పి తిప్పి చెప్పారు.ఏపీ మీద కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.8 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఏనాడు కన్నతల్లి ప్రేమను రాష్ట్రంపై చూపించలేదని విమర్శలు చేశారు.పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి హాజరై తాము అనేక డిమాండ్లను కేంద్రం ముందు ఉంచామని మీడియా సమావేశంలో చెప్పారు.ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను తీర్చాలని అడిగామన్నారు.
అలాగే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మొత్తం నిధులు విడుదల చేయాలని కోరినట్లు వివరించారు.ఏ అంశం చూసినా ఏపీపై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
అయితే విజయసాయిరెడ్డి మాటలు విన్న తర్వాత వైసీపీ కుటిల రాజకీయానికి తెరతీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పుడు ఎలాంటి డిమాండ్లు చేయకుండా ఇప్పుడు ఏదో పార్లమెంట్‌లో తాము కేంద్రప్రభుత్వంపై పోరాడామని నిసిగ్గుగా చెప్పుకునేందుకు ఇప్పుడు బీజేపీపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు చేతిలో 22 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నా సైలెంట్‌గా ఉంటూ ఇప్పుడు సవతి ప్రేమ అంటూ ఆరోపణలు చేయడానికి ఆ పార్టీ నేతలకు అర్హత లేదని రాజకీయ పండితులు విమర్శిస్తున్నారు.వైసీపీ ఇదే వైఖరితో ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఏ మాత్రం క్షమించరని.
మొక్కుబడిగా బీజేపీపై పోరాడుతున్నామని వైసీపీ నేతలు కలరింగ్ ఇవ్వడం సిగ్గుచేటు అని పలువురు మండిపడుతున్నారు.







