విశాఖపట్నం సింహాచలం సింహగిరి ప్రదక్షిణలో పాల్గొనే వారంతా కచ్చితంగా ప్లాస్టిక్‌ను నిషేధించాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసే వారంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె కోరారు .
ప్లాస్టిక్ వాడకాన్ని విశాఖలో గత నెల 5నుంచి నిషేధించామన్న విషయం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన వారికి కూడా గుర్తు చేయాలని కోరారు.ప్లాస్టిక్ వాడకం వల్ల జీవరాశులు మనుగడ కోల్పోతుంటాయని, కాలుష్యం పెనుభూతంగా మారుతుందని, ప్లాస్టిక్‌కు బదులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు.
ఆకులు, పేపరు కవర్లు, కప్పుల్లోనే ప్రసాదాలు పంచాలని, మంచినీరు అందజేసేందుకు స్టీలు గ్లాసులే ఉపయోగించాలని ప్రసాద వితరుల్ని కోరారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, నగర వాసులంతా ఇందుకు సహకరించాలని ఆమె కోరారు.







