సూర్యాపేట జిల్లా:సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ అలుగువెల్లి వెంకట నరసింహారెడ్డి ఆదివారం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.సోమవారం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ఆయన అంతిమయాత్రను ప్రదర్శన నిర్వహించి అక్కడ నుండి సూర్యాపేట జిల్లా కేంద్రానికి తరలించి,చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో విప్లవాభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచారు.
ఈ సందర్భంగా విప్లవ యోధుడు అలుగుబెల్లి భౌతికాయాన్ని వివిధ పార్టీల నాయకులు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు.
ఈ సభలో పలువురు రాజకీయ ప్రముఖులు మాట్లాడుతూ కామ్రేడ్ అలుగుబెల్లి విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలు పునికి పుచ్చుకొని,దోపిడి పీడన లేని రాజ్యం కొరకై చివరి వరకు కొట్లాడిన త్యాగధనుడని కొనియాడారు.తన ఉద్యమం ప్రస్థానంలో లాఠీ చార్జీలు,అక్రమ అరెస్టులు,జైలు జీవితాలు అనుభవించాడని అన్నారు.
తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిన కరీంనగర్ జిల్లాలో ఎంపీగా పోటీ చేసి ప్రజలకు నేనున్నానని అండగా నిలబడ్డాడని,గ్రామ సర్పంచ్ గా మరియు పార్టీలో జిల్లా స్థాయిలో పనిచేసి చివరి శ్వాస వదిలే వరకు విప్లవమే ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గమన్నాడని అన్నారు.వృద్ధాప్యంలో కూడా తనను చూడడానికి వచ్చిన కామ్రేడ్స్ తో వర్గ పోరాటాలని ఎట్లా నిర్మించాలి,కార్యకర్తలను ఎట్లా పెంచుకోవాలి, వారిని మిలిటెంట్ గా ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పేవాడని గుర్తు చేశారు.
అలుపెరగని విప్లవ యోధుడు కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డి రజాకార్లకు,నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా తన దళంతో గెరిల్లాదాడులు కొనసాగించిన ధైర్యశాలని, అతని మృతి పీడిత ప్రజలకు తీరని లోటని,దోపిడీ పీడన అణిసివేతలు లేని రాజ్యం కోసం పోరాడమే కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఈ సంతాప సభలో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దివాకర్,సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం,జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ,సహకారకో-ఆపరేటివ్ జిల్లా చైర్మన్ వట్టి జానయ్య,ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు,అరుణోదయ రాష్ట్ర అధ్యక్షురాలు విమల,న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం రాష్ట్ర నాయకులు అచ్యుత రామారావు,నూతనకల్ జడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి,బిసిపి రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు,ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు సుధాకర్,సిపిఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు,సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ,టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్, స్పర్శ అధ్యయన వేదిక కాకి భాస్కర్, మట్టి మనిషి పాండురంగారావు,అలుగుబెల్లి వెంకటరెడ్డి, సత్యనారాయణరెడ్డి,న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి,కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మారుపెద్ది శ్రీనివాస్,న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి జి.నాగయ్య,ఏఐకెఎమ్ఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్,పివైఎల్ జిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు,అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయి కృష్ణ,అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంచనపల్లి సైదులు,ఉదయగిరి,జిల్లా నాయకులు ఉమేష్,నాగమల్లు,వెంకన్న,చంద్రయ్య, మోహన్ రెడ్డి,రంగారెడ్డి,ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.అనంతరం పార్టీ కార్యాలయం నుండి సూర్యాపేట మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించి డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి అందజేశారు.