యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలోని అక్షర చిట్ ఫండ్ కంపెనీ మోసం చేసిందని గ్రహించిన ఖాతాదారులు బాధితులు ధర్నాకు దిగారు.వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలో అక్షర చిట్ ఫండ్ బ్రాంచిలో ఖాతాదారులకు ఇవ్వాల్సిన చిట్టీ డబ్బులను ఇవ్వకుండా గత కొంతకాలంగా తాత్సారం చేస్తూ ఉండటంతో బాధితులు మంగళవారం చిట్ ఫండ్ బ్రాంచి మేమేజర్ ను నిలదీశారు.
దీనితో తానేమీ చేయలేనని మేమేజర్ చేతులెత్తేయడంతో లబోదిబోమంటూ ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ పైసా పైసా కూడబెట్టికొని చిట్టీలు కడితే లక్షల రూపాయలు ముంచేశారని వాపోయారు.
అక్షర చిట్ ఫండ్ ఈడితో చరవాణిలో మాట్లాడగా సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.చిట్టి డబ్బులు ఎత్తగానే చెక్కు రూపకంగా బాధితులకు ఇచ్చి సర్ది చెబుతున్నారని,ఆ చెక్కును బ్యాంకులో వేయగా బౌన్స్ కావడం మళ్లీ మేనేజర్ దగ్గరుకి వచ్చి అడగగా ఇంకో చెక్కు ఇస్తామని చెప్పి పాత చెక్కులు కూడా తీసుకొన్నారని తెలిపారు.
తమ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా నెలల తరబడి ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మోసపోయామని తెలుసుకుని చిట్ ఫండ్ కార్యాలయం బయట మెయిన్ రోడ్ పై ధర్నాకు దిగామని చెప్పారు.
బాధితుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ధర్నా నిర్వహిస్తున్న బాధితులకు ఎలాగైనా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ధర్నాను విరమింపజేశారు.అక్కడ నుండి వెళ్లి బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో అక్షర చిట్ ఫండ్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానిక ఇన్స్పెక్టర్ సానుకూలంగా స్పందించి చిట్ ఫండ్ నిర్వాహకులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.







