కొల్లాపూర్ టీఆర్ఎస్లో చెలరేగిన చిచ్చు పతాక స్థాయికి చేరింది.ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.
అంతేకాదు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.దాంతో వీరి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
సయోధ్యకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలంకావనే అభిప్రాయంతో పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు.దాంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును అధిష్టానం చిన్న చూపు చూస్తోందనే ఆరోపణ వినిపిస్తోంది.
మరోవైపు ఇరువురు నేతలు కొల్లాపూర్ నియోజకవర్గంలో పట్టు నిరూపించుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.కానీ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.ఎమ్మెల్యే హర్షవర్షన్ రెడ్డిపై బహిరంగంగా చేస్తున్న విమర్శలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి.
ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం సాగునీరు తదితర సమస్యలపై జడను విప్పుతూ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
దాంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు, కార్యకర్తల మధ్య కూడా విభేదాలు కలిగించాయి.రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మొదట్లో జూపల్లి కృష్ణారావు మాట కొంత చెల్లుబాటు అయినా క్రమక్రమంగా పార్టీకి దూరం చేసే విధంగా అధిష్టానం చర్యలు తీసుకుంటుదన్న అభిప్రాయంతో పరిస్థితులు మరింత ముదిరిపాకానపడ్డాయి.జూపల్లి కృష్ణారావు పార్టీ వీడి వెళ్లిపోయేలా ఎమ్మెల్యే అనుచరులు వ్యూహాలు రచించినా ఆయన మాత్రం తన గొంతుకను వినిపిస్తూనే ఉన్నారు.పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు.

అయితే పలుమార్లు జూపల్లి పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆయన కిమ్మనకుండా పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేపై విమర్శల గళం వినిపిస్తున్నారు .ఇటీవల ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం మాజీ మంత్రి జూపల్లిపై ఘాటుగా విమర్శలు చేశారు.ఈ క్రమంలో జూపల్లి సైతం ఎమ్మెల్యేపై పదునైన పదజాలంతో విమర్శలు చేయడం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.







