ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ, జనసేన అధినేతలతో పోలిస్తే టీడీపీ అధినేత అనుభవం ఎక్కువ.
అంతేకాదు వయసు కూడా ఎక్కువే.అయినా కానీ ఆయన జగన్, పవన్ కళ్యాణ్‌లకు ధీటుగా ప్రణాళికలు రచించి ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఏడు పదుల వయసులోనూ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.బుధవారం నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన కూడా ప్రారంభమైంది.
అయితే టీడీపీలో చంద్రబాబు ఒక్కరే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.చంద్రబాబు కుమారుడు లోకేష్ సంగతి పక్కనపెడితే.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, సోమిరెడ్డి, యనమల వంటి సీనియర్ నేతలు అడపాదడపా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్పితే ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు అయితే కనిపించడంలేదు.నిజానికి పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు గతంలో పనిచేసిన వారు ఇప్పుడు కనిపించడం లేదు.
2019 ఎన్నికల్లో కంగుతిన్న పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తేవాల్సిన అవసరముంది.అలా జరగాలంటే ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవాలి.
అంతేకానీ సోషల్ మీడియాలో ట్వీట్లతో కాలం గడుపుతామంటే కుదరదు.ముందస్తు ఎన్నికలు అంటే ఇంకా 8 మాసాలు మాత్రమే సమయం కనిపిస్తోంది.
ఇప్పటికైనా టీడీపీ నేతలు పుంజుకోకపోతే మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి రావొచ్చు.

ఒకవైపు చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ టీడీపీ నేతలను దారిలోకి తీసుకువస్తున్నారు.అయినా ఆయనకు క్యాడర్ నుంచి సపోర్ట్ అందుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి.నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందిగా ఉందనేది చంద్రబాబుకు కూడా నివేదిక అందుతోంది.
ప్రభుత్వ దాడులకు, ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడుతూ టీడీపీ నేతలు బయటకు రావాలంటే జంకుతున్నారు.చంద్రబాబు యాత్రలు విజయవంతం కావాలంటే టీడీపీ క్యాడర్ యాక్టివ్‌గా పనిచేయాలి.లేకుండా చంద్రబాబు యాత్రలు విహారయాత్రలుగా మిగిలిపోయే అవకాశాలున్నాయి.