సాధారణంగా పల్లెటూళ్లలో కోడిపందేల మీద పోలీసులు రైడ్ చేసినప్పుడు అంతా పారిపోతారు.అప్పుడు కేవలం కోడి పుంజులు మాత్రమే దొరుకుతాయి.
వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, స్టేషన్ సెల్‌లో వేసిన ఫొటోలు చూసి ఉంటాం.ఇంకొన్ని సందర్భాల్లో దొంగతనాలకు గురైన జంతువులను స్వాధీనం చేసుకున్నప్పడు స్టేషన్‌లో అవి కనిపిస్తుంటాయి.
అయితే ఏదైనా హత్య కేసులో జంతువులను అరెస్టు చేయడం జరిగితే అది వింతే.ఇది నిజంగానే జరిగింది.
ఓ హత్య కేసులో నిందితుడిగా ఎద్దును అరెస్టు చేశారు.
సూడాన్‌లోని లేక్స్ స్టేట్‌లో ఇటీవల దారుణం జరిగింది.
ఓ 12 ఏళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు.విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది.
ఓ ఎద్దు ఆ బాలుడిని పొడిచి చంపినట్లు తెలుసుకున్నారు.దీంతో చేసేదేమీ లేక నిందితుడిగా ఎద్దును పేర్కొన్నారు.
దానిని అరెస్టు చేసి రుంబెక్ సెంట్రల్ కౌంటీలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు.బాలుడిని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని పోలీసు ప్రతినిధి, మేజర్ ఎలిజా మాబోర్ తెలిపారు.
హత్య కేసులో నిందితుడు సాధారణంగా మనుషులు అని భావించామని, అయితే ఎద్దు అని తేలడంతో దానిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు.

యజమాని తప్పేమీ లేదని తేలడంతో, అతడిని అరెస్టు చేయకుండా వదిలేసినట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా అదే రాష్ట్రంలో ఒక పొట్టేలు 45 ఏళ్ల మహిళను పొడిచి చంపింది.ఆ దాడిలో పక్కటెముకల్లో పొడవడంతో ఆమె మరణించింది.
ఆ కేసులో కూడా పొట్టేలును అరెస్టు చేశారు.ఇలా హత్య కేసుల్లో నిందితులుగా జంతువులను అరెస్టు చేయడం కొంచెం వింతగా ఉందని చర్చ సాగుతోంది.
ఇక బాలుడి హత్య కేసులో అరెస్టు అయిన ఎద్దుకు మూడేళ్ల జైలు శిక్ష పడనున్నట్లు తెలుస్తోంది.ఆ శిక్ష పూర్తైన తర్వాతే దానిని విడుదల చేస్తారు.







