చాలా మంది ఆధార్ కార్డుల్లో తప్పులు ఉండడంతో పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు.పేరులో అక్షర దోషాలు, గుర్తు పట్టలేకుండా ఉండే ఫొటోలు, అడ్రస్‌లో మార్పులు ఇలాంటివి ఎన్నో ఉంటాయి.
వాటిని ఎలా మార్చుకోవాలో సామాన్యులకు తెలియదు.ఆధార్ సెంటర్లకు వెళ్లినా, అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి.
ఇలాంటి ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందు కోసం ఓ చక్కటి పరిష్కారాన్ని కనుగొంది.ప్రతి ఊరి లోనూ పోస్ట్‌మ్యాన్‌ల ద్వారా సమస్యను పరిష్కరించనుంది.
భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లి ఆధార్ నంబర్‌ను మొబైల్ నంబర్‌లతో లింక్ చేయడం, వివరాలను అప్‌డేట్ చేయడం, ఇంటి వద్దే పిల్లల ఆధార్ వివరాలను నమోదు చేయడం వంటి పనులు ఇక నుంచి పోస్ట్‌మ్యాన్లు నిర్వహించనున్నారు.ఇందు కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48,000 మంది పోస్ట్‌మెన్‌లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శిక్షణనిస్తోంది.
రెండవ విడతలో మొత్తం 150,000 పోస్టల్ సిబ్బందికి శిక్షణ అందించనుంది.ఇందులో భాగంగా పోస్ట్‌మెన్‌లు తమ విధుల్లో భాగంగా ఆధార్ కార్డ్ హోల్డర్‌ల అవసరమైన వివరాలను అప్‌డేట్ చేయడానికి డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ఆధారిత ఆధార్ కిట్ ఇవ్వనుంది.
ఇప్పటి వరకు, తాము పిల్లల నమోదు కోసం టాబ్లెట్, మొబైల్ ఆధారిత కిట్‌లను ఉపయోగించి పోస్ట్‌మెన్‌లను ఇందుకు వినియోగించుకుంటున్నామని, రిమోట్ ఏరియాల్లో కూడా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి వీలుగా ల్యాప్‌టాప్ అందజేస్తామని యూఐడీఏఐ చెబుతోంది.పోస్టుమెన్‌లతో పాటు ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క కామన్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్న దాదాపు 13,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను ఇందు కోసం వినియోగించుకోనుంది.







