యాదాద్రి జిల్లా:ఇంతకాలం సేవలందించిన ఆర్టీసి డిపోలోనే బస్సు కింద పడి ఓ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది.ఆర్టీసీ డ్రైవర్ గా మరికొద్ది రోజుల్లో రిటైరవ్వాల్సి వుండగా ఇంతకాలం సేవలందించిన బస్ డిపోలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో మిర్యాల కిషన్ (60) ఆర్టిసి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.ఎన్నో ఏళ్ళుగా ఆర్టిసీ బస్సు నడుపుతూ సేవలందిస్తూ వచ్చిన ఆయన ఈ నెలాఖరులో రిటైర్ అవ్వాల్సి వుంది.
ఇలాంటి సమయంలో డ్రైవర్ కిషన్ దారుణానికి ఒడిగట్టాడు.తాను పనిచేసే ఆర్టీసీ డిపోలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
డిపోలోని బంక్ లో డీజిల్ నింపుకుని వెళుతుండగా ఒక్కసారిగా బస్సుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.హఠాత్తుగా కిషన్ కింద పడటంతో బస్సును ఆపడం డ్రైవర్ కు సాధ్యపడలేదు.
దీంతో బస్సు కిషన్ పైనుండి వెళ్లడంతో అతడు అక్కడిక్కడే మృతిచెందాడు.ఇంతకాలం పనిచేసిన బస్ డిపోలోనే తోటి సిబ్బంది కళ్లముందే కిషన్ ఆత్మహత్యకు పాల్పడడంతో సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.
అయితే ఆర్టీసీ ఉన్నతాధికారుల వేధింపులే కిషన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు.అనారోగ్య కారణాలతో సిక్ లీవ్ పెట్టినా అధికారులు మంజూరు చేయలేదని,దీంతో తీవ్ర డిప్రెషన్ తోనే విధులకు హాజరైన అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
కిషన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని,ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.డ్రైవర్ కిషన్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు యాదగిరిగుట్ట బస్ డిపోకు చేరుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.







