అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.భవిష్యత్ అవసరాల కోసం ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్ల రూపంలో సేకరించి తిరిగి చెల్లించకపోవడం బాధాకరమన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలని బాధితులు అనేక రకాలుగా ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుని తమ అనుచరులు, బంధువులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు.ఇళ్ళు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇల్లు నిర్మించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.
వేల కోట్లతో మిషన్ భగీరథ పైప్ లైన్ లు వేసినా ఫలితం లేదన్న ఆయన, తాగడానికి గుక్కెడు నీటికోసం పల్లెల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్నా సరిపడ కూలీ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.
ప్రభుత్వం చెల్లుస్తున్న కూలీ రేట్లను అడిగి తెలుసుకున్న ఆయన ఉపాధి హామీ కూలీలకు నిర్ణీత సమయంలో కూలి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందిస్తూ మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ గత ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల కోట్ల వక్ఫ్ బోర్డు భూములను బలవంతంగా ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపించారు.
తదనంతరం తల్లాడలో ఏర్పాటు ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు.పినపాక,రెడ్డిగూడెం, గొల్లగూడెం,మల్లారం మీదుగా యాత్ర కొనసాగింది.







