ఏపీ మంత్రి మండలి మొత్తాన్ని జగన్ రాజీనామా చేయించారు.ఆ మంత్రిమండలిలో కొడాలి నాని, పేర్ని నాని వంటి సన్నిహితులు ఉన్నారు.
పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా, ముందుండి ప్రతి విమర్శలు చేసే వారందరినీ జగన్ తప్పించారు. వారి స్థానంలో కొత్తగా సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ, కొత్తవారిని ఎంపిక చేయబోతున్నారు.
ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయిన వారి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. 11వ తేదీన కొత్త మంత్రివర్గం తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు మంత్రులుగా పదవులు అనుభవించిన వారు రాజీనామా చేసే సమయంలో వారి కంటే ఎక్కువగా జగన్ భావోద్వేగానికి గురయ్యారు.
తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నందుకు తమకు బాధ లేదని, పార్టీ కోసం పనిచేస్తామని వారంతా చెప్పడం జగన్ కు ఊరట నిచ్చింది.
రాబోయే ఎన్నికల్లో టిడిపిని ఓడిస్తే తిరుగే ఉండదని, వెయ్యి రోజులు మంత్రులుగా పని చేశారని.ఇంకా ఏడు వందల రోజులు పార్టీ కోసం కష్టపడితే అధికారంలోకి మళ్ళీ వస్తామని , అప్పుడు మీరే మళ్లీ క్యాబినెట్ లోకి వస్తారు అంటూ జగన్ భరోసా ఇచ్చారు.
ప్రస్తుత తాజా మాజీ మంత్రులకు జగన్ పార్టీ పదవులను అప్పగిస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే కేవలం పార్టీ పదవులు మాత్రమే కాకుండా, వారి కోసం కొత్తగా ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో జగన్ ఉన్నారట.
జిల్లాకో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి , వాటి బాధ్యతను వారికి అప్పగించాలని , అలాగే వారికి కేబినెట్ హోదా కల్పించే విషయంలో నూ జగన్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారట.
మంత్రిగా రాజీనామా చేసినా.. కొత్త హోదాల్లో వీరంతా అధికారిక సమావేశాల్లో మంత్రులు తో సమానంగా కూర్చునే అవకాశాన్ని కల్పించే ఆలోచనలో జగన్ ఉన్నారట.దీనిపైనా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరంతా గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని , సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి , పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తమ వంతు సహకారం అందించాలని జగన్ వారికి సూచించారట.
అయితే ఇప్పుడున్న మంత్రులలో కొంత మందిని మాత్రమే కొనసాగించడం ద్వారా, మిగిలిన వారిని తక్కువ చేసినట్లు కాదని, అందరికీ సరైన న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.