ఈనెల 11వ తేదీన ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో గత కొంత కాలంగా బీజేపీ ని ఇరుకున పెట్టేందుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
ఢిల్లీ స్థాయిలో ధర్నా కార్యక్రమం చేపట్టడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడంతో పాటు, టిఆర్ఎస్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చినట్లు అవుతుందని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అభిప్రాయ పడుతున్నారు.అందుకే ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, డిసిసిబి , డీసీఎంఎస్ చైర్మన్ల తో పాటు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర జిల్లా కమిటీ అధ్యక్షులు ఇలా అంతా ఢిల్లీలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు.
వీరితో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకుని ఢిల్లీలో భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది .ఈ మేరకు ఈ నెల 9 ,10 తేదీల్లో వీరంతా ఢిల్లీకి వెళ్లే విధంగా టిక్కెట్లను బుక్ చేశారు.ఢిల్లీకి వెళ్లిన వారికి వసతి బాధ్యతలను ఎంపీలకు అప్పగించారు.
అయితే ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు ఆ పార్టీ నాయకులను టెన్షన్ పెడుతోంది. సీఎం కేసీఆర్ ఈ నెల మూడో తేదీన వైద్య చికిత్స నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు.
పంటి నొప్పితో తీవ్రంగా బాధ పడుతున్న ఆయనకు ఈనెల నాలుగో తేదీన ఒక పన్ను డాక్టర్లు తొలగించారు.

పంటి నొప్పి కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ కాకుండా వెనక్కి వచ్చినట్లుగా టిఆర్ఎస్ చెబుతోంది.దీంతో 11వ తేదీన జరిగే ధర్నా కార్యక్రమానికి కేసిఆర్ హాజరు కావడం పై అనుమానాలు మొదలయ్యాయి.కెసిఆర్ కనుక ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కాకపోతే మొత్తం బాధ్యతలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీసుకుంటారని తెలుస్తోంది.

ఆయనకు వీలిపడని పక్షం లో రాజ్యసభ పక్ష నేత కేకే, లేక లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఈ ధర్నా కార్యక్రమాన్ని లీడ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తే ధర్నా కార్యక్రమానికి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.ఈ విషయంలో టిఆర్ఎస్ శ్రేణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.కేసీఆర్ ఈ విషయంలో ఏం చేస్తారనేది చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపుతూనే ఉంటుంది.
.






