ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయంగా స్పీడ్ పెంచేందుకు నిర్ణయించారు. త్వరలోనే ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించబోతున్నారని, ఆ స్థానం లో వేరొకరిని నియమిస్తారు అనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది.
దీనికి కారణం వైసిపి విషయంలో వీర్రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అలాగే టిడిపి, జనసేన విషయంలో నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అనేకం అధిష్టానానికి అందుతూనే ఉన్నాయి.ఇక జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా, రెండు పార్టీలు ఎడమొహం పెడమొహంగా ఉండడానికి కారణం వీర్రాజు వైఖరేనని, టీడీపీ నుంచి బీజేపీలోకి లో చేరిన రాజ్యసభ సభ్యులు విషయంలోనూ ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన బీజేపీ నాయకులు విషయంలోనూ సోము వీర్రాజు వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.
దీంతో బిజే పీ లో ఎక్కువమంది వీర్రాజు వైఖరిని తప్పుపడుతూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా త్వరలో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలలోనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ, ఈ నెల 7, 8, 9 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉత్తరాంధ్ర జనం కోసం – జల పోరుయాత్ర ” పేరుతో యాత్ర చేపట్టేందుకు సోము వీర్రాజు సిద్ధమవుతున్నారు ఈ యాత్ర ను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జెండా ఊపి ప్రారంభిస్తారు.అలాగే ఆయనకు మద్దతుగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ , జీవీఎల్ నరసింహారావు వంటి వారు హాజరు కాబోతున్నారు.మిగతా బిజెపి నాయకులు ఎంత మంది హాజరవుతారు అనేది సరైన క్లారిటీ లేదు.
ఎందుకంటే ప్రస్తుత బీజేపీ నాయకులు అందరికీ వీర్రాజు వ్యవహారశైలిపై అసంతృప్తి ఉంది.ఇటీవలే బిజెపి అసంతృప్త నేతలు విజయవాడలో రహస్యంగా సమావేశం నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే వీర్రాజు చేపట్టబోయే యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది ? ఆ పార్టీ నాయకులు ఎంత వరకు సక్సెస్ చేస్తారు ? ప్రజల స్పందన ఉంటుందా అనేది అనుమానంగానే మారింది.







