చెన్నై ఐఐటీ నిపుణుల బృందం అందించిన డిజైన్లను అనుసరించి కాకినాడ జగన్నాథపురం కోటిపల్లి బస్టాండ్ వద్ద గల వంతెన మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు.కాకినాడ జగన్నాధపురం వద్ద కృంగిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ మేయర్ సుంకర శివ ప్రసన్న,కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులతో కలిసి వంతెన పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.4 కోట్ల వ్యయంతో వంతెన పనులు చేపట్టామని, రెండు మూడు నెలల్లో పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.అందరి సమష్టి కృషివల్ల వంతెన పనులను ప్రారంభించడం జరిగిందని,అత్యంత నాణ్యతతో పనులు పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఐఐటీ-చెన్నై నిపుణులు ప్రత్యక్షంగానే కాకుండా ఆన్‌లైన్‌లోనూ సమీక్షలు జరిపి, అత్యున్నత ప్రమాణాలతో నివేదిక అందించారని,ఈ సూచనల మేరకే వంతెన పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మీసాల ఉదయకుమార్, చోడిపల్లి వెంకటసత్యప్రసాద్,కార్పొరేటర్లు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.







