తెలంగాణ బడ్జెట్ ను దివాళ తీయించిన టిఆర్ఎస్ ప్రభుత్వం,విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పన్నుల భారం మోపదానికి సిద్ధం అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ఈరోజు ముదిగొండ మండలం కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు.కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు.దేశానికి అచ్చే దిన్ తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తూ, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలకు చచ్చే దీన్ తీసుకు వచ్చాడని ధ్వజ మెత్తారు.
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్ల దేశంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.కిలో మంచి నూనె ప్యాకెట్ ధర రూ.220 ఎగబాకితే పేదలు బతికేది ఎట్లా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రోజువారి వచ్చే కూలీ డబ్బులు నూనె కొనడానికే సరిపోతే కూలీలు ఎట్లా మూడు పూటలు తింటారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.







