టిడిపి జనసేన బిజెపి ఈ మూడు పార్టీల కాంబినేషన్ లోనే వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఎక్కువ గా ఉంటుంది అనే లెక్కల తోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం జనసేన ఆవిర్భావ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు .వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంక్ను చీల్చేందుకు తనకు ఇష్టం లేదని, ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్తామని అన్నట్లుగా మాట్లాడారు.
దీంతో తెలుగుదేశం పార్టీలో ఆశలు చిగురించాయి. బీజేపీ, జనసేన , టిడిపి కాంబినేషన్ లో ఎన్నికలకు వెళితే తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకం పెట్టుకుంది.
ఎన్నికల సమయంలో ఇదే జరుగుతుందని అంతా భావిస్తుండగా, బిజెపి మాత్రం టిడిపితో పొత్తు విషయంలో ఏమాత్రం సముఖంగా లేదు.
గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకునే సమయంలో ఎదురైన అనుభవాలను ఎప్పటికీ బిజెపి అగ్రనేతలు ఎవరు మర్చిపోయినట్టు గా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా బిజెపి ఏపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ టిడిపితో పొత్తు అంశాన్ని ప్రస్తావించారు.కర్నూలులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీతో పొత్తు ఉండదని తెల్చేశారట.
అంతేకాదు ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ పొత్తుల అంశంతో పాటు, బీజేపీ రూట్ మ్యాప్ అంశంపైన మాట్లాడడంతో, దీనిపైన ఈ సమావేశంలో చర్చించారు.టీడీపీతో పొత్తు విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని, బిజెపి ఆలోచించాల్సింది జనసేన గురించి మాత్రమే అంటూ సునీల్ దియోధర్ క్లారిటీ ఇచ్చారు.

టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి అగ్రనేతలు ఎవరు ఇష్టపడడం లేదని, ఎన్నికల సమయం నాటికి దీని పై స్పష్టమైన ప్రకటన చేస్తారని, టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలు విభేదిస్తే ఈ వ్యవహారంపై తేల్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని సునీల్ దియోధర్ క్లారిటీ ఇచ్చారట.అంతేకాదు పొత్తుల అంశం రాష్ట్ర స్థాయిలో తేలేది కాదని, ఢిల్లీలోనే దీనిపై ఒక క్లారిటీ వస్తుందని, ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించినా, దానిపై స్పందించ వద్దని పార్టీ నేతలకు సునీల్ దియోధర్ హిత బోధ చేసినట్లు సమాచారం.సునీల్ దియోధర్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే 2024 ఎన్నికల నాటికి టిడిపితో పొత్తు ఉండదని బిజెపి అగ్రనాయకులు ప్రకటన చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మరి ఈ విషయంలో పవన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు చూడాలి.







