కువైట్ జైల్లో కడప జిల్లాకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
వెంకటేశ్ మరణంపై అనుమానాలు వున్నాయని.దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా కువైట్‌లోని ఇండియన్ ఎంబసీకి చంద్రబాబు లేఖ రాశారు.
ఈ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.
వెంకటేష్ జైలులో మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయని.దీనిపైన అత్యున్నత స్థాయిలో సమగ్ర విచారణ జరిపించేందుకు భారత రాయబార కార్యాలయం చొరవ చూపాలని శ్రీనివాస రెడ్డి కోరారు.
వెంకటేష్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
కాగా.
ముగ్గురిని హత్య చేశారన్న అభియోగంపై కువైట్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కడప జిల్లాకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి జైల్లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు.బుధవారం సాయంత్రం జైలులో మంచానికి వున్న వస్త్రంతో ఉరి వేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు కుమారుడు పిలోళ్ల వెంకటేశ్ ఉపాధి నిమిత్తం మూడేళ్ల కిందట కువైట్‌కు వెళ్లాడు.అక్కడ ఒకరి ఇంట్లో డ్రైవర్‌గా పనికి కుదిరాడు.
పరిస్ధితులు అనుకూలించడంతో రెండేళ్ల తర్వాత వెంకటేశ్ తన భార్య స్వాతిని కూడా కువైట్ తీసుకెళ్లాడు.భార్యాభర్తలిద్దరూ అక్కడే ఉంటుండగా, వీరి ఇద్దరు పిల్లలు మాత్రం దిన్నెపాడులో తాత దగ్గర ఉంటున్నారు.
అయితే కువైట్‌లో వెంకటేశ్ పనిచేస్తున్న యజమాని ఇంట్లో మార్చి 6న భారీ చోరీ జరిగింది.గుర్తు తెలియని దుండగులు ఇంటి యజమానితో పాటు అతడి భార్య, కుమార్తెను చంపేసి.
డబ్బు, నగలను అపహరించుకుపోయారు.ఐతే వెంకటేషే ఈ హత్యలు చేశాడని కువైట్ పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య జరగడానికి ముందు మృతుల నుంచి వెంకటేష్‌కే ఎక్కువ ఫోన్ కాల్స్ వెళ్లాయని ఆరోపిస్తూ… అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

కానీ ఆ హత్యలతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని వెంకటేష్ భార్య స్వాతి ఆరోపిస్తోంది.తప్పుడు కేసు పెట్టి తన భర్తను జైల్లో చిత్రహింసలకు గురి చేశారంటూ విలపిస్తోంది.తన భర్త వెంకటేశ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత తనను బలవంతంగా ఇండియా పంపించారని ఆరోపిస్తోంది.
పని నిమిత్తమే యజమానులు తమకు ఫోన్ చేసే వారని.అంతకు మించి ఈ హత్యలు, దోపిడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది.
నిజంగా వెంకటేష్ హత్య చేసి ఉంటే.సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదని స్వాతి నిలదీస్తోంది.
మృతులకు వారి బంధువులతో గొడవలు ఉన్నాయని.వారే ఈ హత్యలు చేసి.వెంకటేష్‌ను ఇరికించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది.తమ భర్తను విడిపించాల్సిందిగా ఇటీవలే కడప కలెక్టర్‌ని కూడా ఆశ్రయించింది.
దీంతో అధికారులు, రాజకీయ నాయకుల విన్నపంతో ఇండియన్ ఎంబసీ అధికారులు కువైట్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.ఆ ప్రయత్నాల్లో ఉండగానే వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడటంతో వీరి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
తన భర్త ఆత్మహత్య చేసుకొని ఉండడని.జైలు అధికారులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్వాతి ఆరోపిస్తోంది.







