ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఆ దేశం స్మశానాన్ని తలపిస్తోంది.బాంబు పేలుళ్లు, ఎటు నుంచి క్షిపణులు దూసుకొస్తాయో తెలియక ఉక్రెయిన్ వాసులు బంకర్లలో బిక్కుబిక్కుమంటున్నారు.
పోని దేశం విడిచి పారిపోదామని అనుకుంటే ఇప్పటికే అన్ని నగరాలను రష్యా సేనలు కమ్మేశాయి.ప్రస్తుతం వీరితో ఉక్రెయిన్ సేనలు భీకరంగా పోరాడుతున్నాయి.
దీంతో తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడటంతో పాటు గాయాలకు చికిత్స అందక ప్రజలు విలవిలలాడుతున్నారు.ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థలు, పలు దేశాలు ఉక్రెయిన్‌కు మానవతా దృక్పథంతో సాయం అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైద్య సామాగ్రిని అందించేందుకు ప్రయత్నిస్తోన్న అమెరికాకు చెందిన ఓ ఎన్జీవోను లాజిస్టిక్స్ సమస్యలు చికాకు పెడుతున్నాయి.Project C.U.R.E.అనే ఈ సంస్థకు అమెరికా వ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లు వున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన నాటి నుంచి వీరంతా నాన్‌స్టాప్‌గా పనిచేస్తున్నారు.మందులు, ఆహారం, వైద్య సామాగ్రి, బట్టలు వంటి వాటిని వాలంటీర్లు నిరాంతరాయంగా ప్యాక్ చేస్తూనే వున్నారు.
అయితే వీటిని వార్ జోన్‌కు పంపడం అంత సులభం కాదు.ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో లాజిస్టిక్స్, షిప్పింగ్ సమస్యలు ఈ సంస్థ ప్రయత్నానికి అవరోధంగా మారాయి.
దీనిపై ప్రాజెక్ట్ సీయూఆర్ఈ ప్రెసిడెంట్, సీఈవో డగ్లస్ జాక్సన్ మాట్లాడుతూ.ప్రస్తుతం విమానాలు, కంటైనర్లు ఉక్రెయిన్‌కు వెళ్లడం కష్టంగా వుందన్నారు.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ షిప్పింగ్ ప్రక్రియను రెండు మూడు నెలలు వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు డగ్లస్ చెప్పారు.ఉక్రెయిన్‌కు పంపాల్సిన సామాగ్రి అంతా గోడౌన్‌లోనే వుంచామని ఆయన పేర్కొన్నారు.

అమెరికాలోని పలు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ సీయూఆర్ఈ శాఖల నుంచి వైద్య సామాగ్రి.ఉక్రెయిన్‌కు చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వుంటుంది.కొలరాడో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి .ట్రక్కులో చికాగోకు , చికాగో నుంచి ట్రక్కులోనే టొరంటోకు.టొరంటో నుంచి వార్సాకు విమానంలో … వార్సా నుంచి ట్రక్కులో ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి వుంటుంది.కొలరాడోలో స్థిరపడిన ఉక్రెనియన్లు.ఉక్రెయిన్ నుంచి వస్తోన్న అభ్యర్ధులను సమన్వయం చేస్తున్నారు.







