దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఫిబ్రవరి 21 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతిస్తామన్న మాటను ఆస్ట్రేలియా నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా భారతీయులకు ఆస్ట్రేలియా సర్కార్ బంపరాఫర్ ప్రకటించింది.2020 మార్చి 20 నుంచి 2022 జూన్ 30 మధ్య వీసా గడువు ముగిసిన భారతీయులకు , కొత్త వీసా దరఖాస్తు రుసుమును మినహాయిస్తున్నట్లుగా ప్రకటించింది.ఇటీవలి కాలంలో క్వాంటాస్, ఎయిరిండియాలను డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించడం పర్యాటక రంగానికి ఊతమిస్తుందని టూరిజం ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే ఈ వ్యూహం ఫలించినట్లుగానే తెలుస్తోంది.ఆస్ట్రేలియా పర్యటన కోసం అనేక మంది భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారు.ఈ మేరకు ఆ దేశ టూరిస్టు వీసా కోసం భారతీయుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఒక అధ్యయనం ప్రకారం.వచ్చే రెండేళ్లలో 1.8 మిలియన్ల మంది భారతీయులు ఆస్ట్రేలియాను సందర్శించాలని ప్రణాళికలు పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్ , నవంబర్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టీ 20 టోర్నీకి ముందు కూడా ఆస్ట్రేలియా వెళ్లేందుకు భారీ డిమాండ్ వుంటుందని అంచనా వేస్తున్నారు.ప్రచార కార్యకలాపాలు, పబ్లిక్ రిలేషన్స్, ఎయిర్‌లైన్స్‌ల సాయంతో భారతీయ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆస్ట్రేలియా పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

2020 మార్చి 20 నుంచి 30 జూన్ 2022 మధ్య గడువు ముగిసిన సందర్శకుల వీసాను కలిగి వున్న ప్రయాణీకుల వీసా దరఖాస్తు ఛార్జీని మినహాయిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం ఎలాంటి రుసుము లేకుండా టూరిస్ట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు.డిసెంబర్ 31లోగా తమ దరఖాస్తులను పంపినవారికే ఈ మినహాయింపు వర్తించనుంది.ఇకపోతే ఆస్ట్రేలియాకు రావాలంటే చెల్లుబాటు అయ్యే వీసాతో పాటు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ రెండు డోసులు పూర్తయినట్లుగా వ్యాక్సిన్ సర్టిఫికేట్, ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి వుంటుంది.
అలాగే 72 గంటల ముందు డిజిటల్ ప్యాసింజర్ డిక్లరేషన్ సమర్పించాల్సి వుంటుంది.







