ప్రపంచంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ భయపడేది చావు గురించే.మరి కొంత కాలం ఈ లోకంలో బ్రతకాలని, ఎన్నో ఆశలతో ప్రజలంతా జీవిస్తుంటారు.కలలో కూడా చావు గురించి ఆలోచించరు.అలాంటిది ఓ వ్యక్తి 15 ఏళ్లుగా తన చావు కోసం నిరీక్షిస్తున్నాడు.దాని కోసం ఏకంగా ముందుగానే సమాధి నిర్మించు కున్నాడు.అలా అని అతడికి దీర్ఘకాల రోగాలేవీ లేవు.
ఆరోగ్యంగా ఉన్నా చావు కోసం నిరీక్షించడం, సమాధి నిర్మాణం తదితర అంశాలపై ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
కర్ణాటక దావణగెరెలోని జారెకట్టేకు చెందిన తిప్పన్న రావుకు ప్రస్తుతం 70 ఏళ్లు.
ఆయనకు 17 ఏళ్ల క్రిందటే ఎందుకో జీవితంపై విరక్తి కలిగింది.దీంతో ఆ సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.2007లోనే తన చావును కోరుకుంటూ ఏకంగా సమాధి కట్టుకున్నాడు.దానికి తిరిగి మట్టిలోకి అనే అర్ధాన్నిచ్చే మరళి మణ్నిగే అనే పేరు కూడా పెట్టుకున్నాడు.
తన సొంత డబ్బులతో ఆ సమాధి నిర్మాణాన్ని చేపట్టాడు.తాను మరణించిన తర్వాత ఆ సమాధిలోనే ఖననం చేయాలని కుటుంబ సభ్యులను కోరాడు.అయితే అతడు ఎంతగా ఎదురు చూసినా ఇంకా మరణం ఆయన దరి చేరలేదు.15 ఏళ్లు నిర్విఘ్నంగా గడిచిపోయాయి.

తిప్పన్నరావు స్వగ్రామం కర్నాటకలోని జారెకట్టే గ్రామం. అయినప్పటికీ దావణగిరిలోనే నివాసముంటున్నాడు.అక్కడే సమాధి కట్టి, దాని ముందు చిన్న గుడి కూడా నిర్మించాడు.అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం వసతి గృహాన్ని కూడా కట్టాడు.తరచూ అక్కడికి వస్తూ, పోతూ పేదలకు, భక్తులకు పండ్లు పంపిణీ చేస్తుంటాడు.అది తనకు చాలా మానసిక సంతృప్తిని ఇస్తుందంటాడు తిప్పన్న.
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అని పెద్దలంటుంటారు.ఆ సామెత ఈయనకు సరిగ్గా సరిపోతుందేమో.







