తాను పనిచేసిన హోదానే ఇంటి పేరుగా జనాలతో పిలిపించుకుంటూ, సమర్ధుడు, నీతి నిజాయితీ గల వ్యక్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.జనసేనలో ఆయన చేరి విశాఖ ఎంపీగా ఆయన పోటీ చేసి ఓటమి చెందారు.
ఇక ఆ తరువాత జనసేన లో చోటు చేసుకున్న పరిణామాలు ఆయనకు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.తర్వాత కొంత కాలం సైలెంట్ గానే ఉన్నారు.
బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా, ఆ దిశగా అడుగులు వేయలేదు.
ఇదిలా ఉంటే ఆయన ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు కొంతమంది హైదరాబాదులో రహస్య సమావేశం నిర్వహించగా, దానికి జేడీ కూడా హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు.
అప్పటి వరకు జేడీ కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తారు అనుకున్న వారంతా షాక్ అయ్యారు.ఇంకా అడపదడపా కాపు సమావేశాలకు ఆయన హాజరవుతూ వస్తున్నారు.
నిన్న విజయవాడలో జరిగిన బహుజన ఫ్రంట్ సమావేశానికి ఆయన హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సమావేశంలో లక్ష్మీనారాయణ కులాల అంశాన్ని ప్రస్తావించారు.
ఆయన ప్రసంగం మొత్తం కులాల అంశంపైనే చేశారు. వివిధ కులాల అంశాన్ని ప్రస్తావించిన వారు రాజ్యాధికారం చేపట్టడం గురించి ఎక్కువగా తన ప్రసంగంలో ప్రస్తావించారు.
దీంతో ఉన్నతాధికారిగా పనిచేసి, ప్రజల్లో జెంటిల్మెన్ గా గుర్తింపు పొందిన లక్ష్మీనారాయణ ఇప్పుడు సాధారణ నాయకుల్లాగా కులాల అంశాన్ని ప్రస్తావించి జనాల్లో ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదంతా కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న ఒక ప్రత్యేక కూటమి రాజకీయంగా ముందడుగు వేయబోతున్న క్రమంలో వివిధ కులాల మద్దతు పొందేందుకు , ఆయా సామాజిక వర్గాల అండదండలు పొందేందుకు ఆయన సాధారణ నాయకుడు మాదిరిగానే ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.







