ఆస్ట్రేలియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఈ ఘటనలో ఇద్దరు భారత సంతతి తల్లీ, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు.
వెంట్వర్త్విల్లేలో హేమలతా సోల్హైర్ సచ్చితనాంతం, బ్రమూత్ మృతదేహాలను కనుగొన్నారు.సోమవారం కనిపించకుండా పోయిన వారు మజ్డా 3 మురికినీటి కాలువలో శవాలుగా తేలారు.
న్యూసౌత్‌వేల్స్ పోలీస్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ పాల్ దేవానీ మాట్లాడుతూ. కాన్స్టిట్యూషన్ హిల్ సమీపంలోని కూపర్స్ క్రీక్ కెనాల్లో ఒక మహిళ మృతదేహం కనుగొన్నట్లు తెలిపారు.7 న్యూస్ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి.పోలీసులకు సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు.
వరదనీటి ఉద్ధృతి నేపథ్యంలో హేమలత మృతదేహాన్ని వెలికి తీయడం కష్టంగా మారిందన్నారు.అక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఆమె కుమారుడు బ్రమూత్గా భావిస్తోన్న వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పాల్ దేవానీ చెప్పారు.
ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో బాధితులిద్దరూ ప్రయాణం చేయకుండా వుండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ డొమినిక్ పెరోటిట్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబం, సన్నిహితుల కోసం ప్రార్ధిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మరోవైపు వరదల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది.వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని స్కాట్ మోరిసన్ పర్యటించారు.2019లో విధ్వంసక బుష్ ఫైర్స్ తర్వాత ఆస్ట్రేలియాలో అత్యవసర ప్రకటన విధించడం ఇదే తొలిసారి.ఇప్పటి వరకు వరదల కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు.చాలా రోజులుగా విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు నిలిచిపోవడంతో అధికారులపై నార్తర్న్ రివర్స్లోని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద శిథిలాలను తొలగించడానికి ఈ ప్రాంతంలో 4000కు పైగా సైనిక సిబ్బందిని మోహరించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.