సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఆగిపోవడానికి వానదేవుడు అడ్డొస్తాడు.వర్షం తగ్గిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనగానే మళ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
వర్షం ఒక్కటే కాదు ఒక్కోసారి మైదానంలోకి శునకాలు, ఇతర జంతువులు, పక్షులు వస్తుంటాయి.అలాంటప్పుడు మ్యాచ్ నిలిపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అదే విధంగా ఒక్కోసారి అనుకోకుండా ఎవరైనా ప్రేక్షకులు మైదానంలోకి వచ్చినప్పుడు కూడా క్రికెట్ ఆటకు కొద్ది సేపు అంతరాయం కలిగిన సందర్భాలున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక అనుకోని అతిధి కారణంగా మ్యాచ్‌కు అంతరాయం వాటిల్లింది.
వివరాల్లోకి వెళితే.ముంబాయి వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆదివారం రోజున ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.అది ఏంటంటే మ్యాచ్‌ని కవర్ చేసే స్పైడర్ కెమెరా పిచ్ కి అతి దగ్గర ఎత్తులో వచ్చి అటు పైకి వెళ్లకుండా.ఇటు కిందకు రాకుండా.
మధ్యలోనే ఆగిపోయింది.అది గమనించిన గ్రౌండ్ సిబ్బంది హుటాహుటిన మైదానంలోకి వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఎంతసేపు ప్రయత్నం చేసిన అది సాధ్యపడలేదు.చేసేది లేక అంపైర్లు నిర్ణీత సమయానికంటే ముందుగానే టీ బ్రేక్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మైదానంలో ఆగిపోయిన స్పైడర్ కెమెరాతో టీమిండియా క్రికెటర్లు సరదగా ఒక ఆటాడుకున్నారు.టీమిండియా క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు కెమెరా ముందు నిలబడి’ ఏయ్.ఇక్కడి నుంచి వెళ్లిపో’ అన్నట్లు సైగలు చేసారు.అలాగే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బాహుబలి రేంజ్‌లో ఆ కెమెరాని భుజాలమీదకు ఎత్తుతున్నట్లు తెగ పోజులిచ్చాడు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అవి చూసిన నెటిజన్లు కూడా వాళ్ళ స్టైల్ లో మీమ్స్‌తో చెలరేగిపోయారు.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ చివరి బంతికి కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్ ఎల్బీగా వెనుదిరిగిన తర్వాత మైదానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.