సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా అమ్మాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది.వైసీపీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పవన్ పై విమర్శలు చేస్తుండగా, పవన్ ట్విట్టర్ ద్వారా ఆ విమర్శలకు సమాధానం చెబుతూనే, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ? ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలపై స్టేట్మెంట్స్ ఇస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఈ వ్యవహారం టాలీవుడ్ లోనూ చీలిక తెచ్చింది. పవన్ కు మద్దతుగా కొంతమంది, వ్యతిరేకంగా మరికొంతమంది స్టేట్మెంట్లు ఇస్తుండగా , పవన్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని , దీనికి తెలుగు చిత్రసీమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన వచ్చేసింది.
అయితే ఈ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ, అటు జగన్ తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవికి పెద్ద తలనొప్పిగా మారింది.
టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై తరచుగా చిరంజీవి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
అలాగే ఏపీ సీఎం జగన్ దగ్గరకు అనేకసార్లు వెళ్లి టాలీవుడ్ సమస్యలను చిరంజీవి ప్రస్తావించారు.అలాగే జగన్ పరిపాలన పై ప్రశంసలు కురిపిస్తూ అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా చిరంజీవి జగన్ ను అభినందించారు.
చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
అప్పుడప్పుడు టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై స్పందిస్తున్నారు.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను అమ్మాలి అని నిర్ణయించుకోవడం పెద్ద దుమారమే రేపుతోంది.

ఈ విషయాన్ని పవన్ చాలా సీరియస్ గానే తీసుకుని ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.దీంతో ఈ వ్యవహారంపై మెగాస్టార్ తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే చిరంజీవి నిర్ణయం ఖచ్చితంగా పవన్ కు కానీ, వైసీపీ ప్రభుత్వానికి కానీ ఎవరో ఒకరికి ఆగ్రహం కలిగించవచ్చు.దీంతో ఈ విషయంలో ఏం చేయాలని దానిపై చిరంజీవి సైతం ఎటు తేల్చుకోలేక పోతున్నారు.
ఇక తనకు సన్నిహితుడిగా పేరుపడిన పోసాని కృష్ణమురళి తాజాగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే ఆయన పై పవన్ అభిమానులు దాడి చేయడం వంటి వ్యవహారాలు చోటుచేసుకోవడంతో, తప్పనిసరిగా చిరంజీవి దీనిపై స్పందించి , ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత ఆయనపై ఏర్పడింది.
దీంతో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే దానిపై అటు వైసీపీ, ఇటు జనసేన వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.







