కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో థమ్స్ అప్ బాటిల్ లో ఒక పాము పిల్ల ప్రత్యక్షమై అందరినీ హడలెత్తించిన విషయం తెలిసిందే.ఒక షాపు ఓనర్ థమ్స్ అప్ బాటిల్ అడుగు భాగంలో చచ్చిపోయిన ఓ పాము ఉందని గుర్తించి వెంటనే థమ్స్ అప్ బాటిల్స్ ని తిరిగి పంపించేశారు.
అదృష్టవశాత్తు ఆ బాటిల్ ని ఎవరు తాగలేదు.ఐతే తాజాగా తమిళనాడులో ఒక మందు బాటిల్ లో పాము పిల్ల ప్రత్యక్షమైంది.
ఈ విషయం తెలియక ఒక వ్యక్తి పాము పిల్ల ఉన్న మందు బాటిల్ సగం వరకు తాగేశాడు.అనంతరం బాటిల్ లో ఏదో ఉందని గమనించిన సదరు వ్యక్తి తీక్షణంగా పరీక్షించాడు.
దీంతో తాను తాగుతున్న బాటిల్ లో పాము పిల్ల ఉందని అతనికి తెలిసింది.మొదట్లో తాగిన మైకంలో తానేదో బ్రమ పడుతున్నట్టు భావించిన ఆ వ్యక్తి కొంతసేపటికి నిజంగానే తన మందు బాటిల్ లో పాము ఉందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
వివరంగా తెలుసుకుంటే.తమిళనాడులోని అరియాలూరు జిల్లా చుట్టమల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే 32 ఏళ్ల వ్యక్తి తన సొంత గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు.అయితే రోజంతా వ్యవసాయ పనుల చేసి అలసి పోయే సురేష్ రాత్రి సమయంలో మద్యం పుచ్చుకునేవాడు.ఏప్రిల్ 14 అనగా బుధవారం రాత్రి కూడా అతను ఇంటికి వెళ్లే సమయంలో ప్రభుత్వ ఆధీనంలో నడిచే టాస్మాక్ దుకాణంలో మద్యం బాటిల్ కొనుగోలు చేశాడు.
అనంతరం ఇంటికి వెళ్లి మద్యం గ్లాసులో పోసుకుని తాగడం ప్రారంభించాడు.అయితే బాటిల్ లోని సగం మద్యం తాగిన తర్వాత తనకు ఏదో తేడాగా అనిపించింది.
దీంతో శ్రద్ధగా పరిశీలించి చూడగా తన మందు బాటిల్ లో పాము పిల్ల ఉందని అర్థమైంది.దీంతో విష సర్పం వల్ల తనకు ఏమైనా అవుతుందేమోనని సురేష్ బాగా భయపడిపోయాడు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.వారు వెంటనే అతడిని జయకొండం ఆస్పత్రికి తరలించారు.అయితే మందు బాటిల్ లోని పాము పిల్లని పరిశీలించిన వైద్యులు వెంటనే అవసరమైన వైద్యం చేసి సురేష్ ప్రాణాలకు ఎటువంటి హానీ లేదని కుటుంబ సభ్యులకు తెలిపారు.ఆ తర్వాత సురేష్ కుటుంబ సభ్యులంతా కలిసి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న టాస్మాక్ దుకాణం వద్దకు వెళ్లి ఆందోళనలు చేశారు.
దీనితో మందు బాటిల్స్ తాము తయారు చేయమని.కనీసం మందు బాటిల్ కి సిల్ కూడా వేయమని సదరు దుకాణ యజమానులు సీరియస్ అయ్యారు.దీంతో ఏం చేయాలో తెలియక సురేష్ కుటుంబ సభ్యులు వెనుదిరిగారు.అయితే ప్రస్తుతం సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.