తెలంగాణ మంత్రివర్గం శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కాబోతుంది.ఈనెల 13,14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరుగనున్నట్లు తెలుస్తుంది.ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ, 14న ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది.13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశ పెడతారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరపబోతుంది.
ఇక , శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది.
అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ లో చర్చించవచ్చు.
సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 16 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.ఆ వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
వీఆర్వో వ్యవస్థతో పాటు రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కాగా, వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 28 వరకు జరగాల్సి ఉంది.
కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో 16 వరకే పరిమితం చేశారు.ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోగ్యం దృష్ట్యా 12 రోజులు ముందే ముగించారు.