ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడడం అందరికీ బాగా అలవాటయింది.ఏపీలో అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణలో, తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏపీలో పేర్లు మార్చి అమలు చేస్తున్నారు.
ఇక తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరూ మంచి స్నేహితులు కావడం, ఇద్దరి ఉమ్మడి శత్రువు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కావడం తో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇలా అన్ని విషయాల్లోనూ రెండు ప్రభుత్వాలు ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తున్నాయి.
అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవడం లేదు.కనీసం కెసిఆర్ నిర్ణయాలను ప్రశ్నించేందుకు కూడా ఎవరు సాహసించడం లేదు.
ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉందని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, టిడిపి అధినేత చంద్రబాబు కానీ కెసిఆర్ నిర్ణయాలను ప్రశ్నించేందుకు సాహసించడం లేదు.ఎందుకంటే కెసిఆర్ తో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో చంద్రబాబుకు, పవన్ కు బాగా తెలుసు.
2014 ఎన్నికల్లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది.పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ లో ఉండే అవకాశం ఉన్నా, చంద్రబాబు రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి వచ్చేశారు.
దీంతో కెసిఆర్ తో వ్యవహారం ఎలా ఉంటుందో అప్పుడు జనాలకు కూడా బాగా అర్థమైంది.తనపై విమర్శలు చేసిన వారిని ఆషామాషీగా కెసిఆర్ వదిలిపెట్టరు.
అందుకే తెలంగాణ విషయాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఏపీ రాజకీయాల పైన పవన్, చంద్రబాబు పూర్తిగా ఫోకస పెట్టారు.ఏపీలో జగన్ పాలనపై తరచుగా విమర్శలు చేస్తూ, జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాజకీయాలు నడిపిస్తున్నారు.
వాస్తవంగా చెప్పుకుంటే తెలంగాణలో కెసిఆర్ రాజకీయ ప్రత్యర్ధులు విషయంలో నిరంకుశంగానే వ్యవహరిస్తున్నారు.ప్రతిపక్షం అనేది లేకుండా చేసేందుకు మిగతా పార్టీల నాయకులను తన పార్టీలో కలిపేసుకుంటున్నారు.
కానీ జగన్ విషయానికి వస్తే ఆ విధంగా చేయడం లేదు.అయినా మొత్తం దృష్టి అంతా జగన్ పైన పెట్టి బాబు, పవన్ రాజకీయాలు చేస్తున్నారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ భవనాలకు రంగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అయితే అది వైసీపీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేస్తున్నారు అంటూ టిడిపి రాద్ధాంతం చేయడమే కాకుండా కోర్టుకు వెళ్లింది.దీంతో కోర్టు ఆదేశాల మేరకు రంగుల ను మార్చారు.అయితే రెండో సారి వేసిన రంగుల పై వైసీపీ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చినా కోర్టు దాన్ని కూడా సస్పెండ్ చేసింది.
ఈ విషయంలో టిడిపి జనసేన పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.ఏపీలో రంగుల రాజకీయం నడుస్తోంది అంటూ నానా యాగి చేశాయి.అయితే తెలంగాణలో సైతం ఇదే విధంగా గులాబీ రంగులు వేస్తున్నారు.ఆఖరికి స్మశానాలలోను కూడా వదిలిపెట్టకుండా, గులాబీ రంగు లు వేస్తున్నారు.
ఈ విషయంపై బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.ఈ విషయంపై స్పందించేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గాని ధైర్యం చేయడం లేదు.
ఇదే కాదు కొంతకాలం గా లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసి ఉంచారు.

ఇక కొద్ది రోజుల క్రితం దేశమంతా మద్యం దుకాణాలు తెరిచారు.అయితే ఈ విషయంలో జగన్ ను మాత్రమే తప్పుపడుతూ అనేక విమర్శలు, రాద్ధాంతాలు చేశారు.కానీ తెలంగాణలోనూ అదే సీన్ కనిపించినా విమర్శలు చేసేందుకు ధైర్యం చేయలేకపోయారు.
ఇవే కాకుండా ప్రతి విషయంలోనూ కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ తెలంగాణ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోతున్నారు.ఆ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఉనికిలో ఉన్నాయి.
నాయకులూ ఉన్నారు.అయినా అక్కడ గొంతు పెంచేందుకు సాహసం చేయలేకపోతున్నారు.
కెసిఆర్ తో వ్యవహారం ఎలా ఉంటుంది అనేది ఇద్దరు నేతలకు బాగా తెలుసు.కాబట్టే అక్కడ గొంతు పెంచాలంటే వణికిపోతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.