రాజకీయాల్లో ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేం.అవసరానికి తగ్గట్టుగా ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో నాయకులకు బాగా తెలుసు.
దీంట్లో రాజకీయ నాయకులు ఒకరిని మించి ఒకరు తెలివితేటలు చూపిస్తూ ఉంటారు.ఆ విధంగానే ఇప్పుడు బిజెపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకునేందుకు సిద్ధమైంది.
చాలాకాలంగా తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి పరిస్థితులు అనుకూలించడం లేదు.ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుండడం, ఇటీవల ఒక్కో రాష్ట్రంలో పటు కోల్పోతుండడం, ఢిల్లీ లో తాజాగా ఘోర ఓటమి చెందడం ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి.

సీఏఎ పై ఇటీవల బీజేపీ కఠిన నిర్ణయం తీసుకోవడంతో బీజేపీపై మరింతగా వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది.ఈ నేపధ్యంలో సీఏఏ పై అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి దీనిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే బిజెపి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం.
ఆయనతోపాటు ఇటీవలే ఎన్డీయేలో చేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు మరో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ సీఏఏ కు కు వ్యతిరేకంగా గట్టు వాయిస్ వినిపిస్తున్నారు.అలాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిని గట్టిగా వ్యతిరేకించడంతో పాటు సీఏఎ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు ఆ బిల్లుకు సంబంధించిన ప్రతులను కూడా చించివేసి నిరసన తెలియజేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో బిజెపి సభ నిర్వహించడం ద్వారా ఆ ఇద్దరు నేతలకు చెక్ పెట్టినట్లు అవుతుందని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.
వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ వేదికగా ఈ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం.`

దేశవ్యాప్తంగా ప్రజల్లో సీఏఎ పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజల అనుమానాలను తొలగించేందుకు బిజెపి నడుంబిగించింది.అందుకే ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా బిజెపి తీసుకుంది.తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఇక్కడ బలపడాలని చూస్తోంది.స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందినా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన శక్తిగా, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తప్పకుండా ఎదుగుతామని బిజెపి భావిస్తోంది.
అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను కూడా తెలంగాణలో వాడుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంది.అయితే కొద్ది రోజులుగా బీజేపీతో పొత్తుపై వ్యాఖ్యానిస్తున్న పవన్ ఆ పార్టీపై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ అమిత్ షాతో కలసి ఈ సభలో పాల్గొంటారా అనేది సందేహంగానే ఉంది.







