కొద్దీ రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీజేపీకి వైసీపీ కి మధ్య స్నేహం ముగిసినట్టే కనిపిస్తోంది.తెలుగుదేశం, చంద్రబాబు మీద ఉన్న కోపంతో వైసీపీకి ఎన్నికల్లో అన్నిరకాల సహాయ సహకారాలు అందించింది బీజేపీ.
అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళల్లో జగన్ ఏమి కోరినా కాదనకుండా ఇచ్చింది.అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తోంది.
ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు కొద్దిరోజులుగా వైసీపీ మీద విమర్శలు గుప్పించడం వెనుక ఉన్న రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధం పట్టడంలేదు.తాజాగా బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి మాణిక్యాలరావు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ తీరుపై విమర్శలు చేశారు.

జగన్ అసెంబ్లీ లో గాడిదలు కాస్తున్నారా అనే మాటలు సరికాదు అంటూ హితవు పలికారు.అంతే కాదు వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలలోని పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఇటీవల విడుదల చేసిన గ్రామ వాలంటీర్ల పోస్టులలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించుకుంటున్నారని మాణిక్యాలరావు విమర్శలు చేశారు.అంతేకాదు రేషన్ డీలర్లకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తామంటూ బీజేపీ తరపున ఆయన ప్రకటించారు.బీజేపీ నాయకుడు ఒక్కసారిగా ఈ విధమైన విమర్శలు చేయడంతో వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది.
దీని వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారా లేక వీరు సొంతంగా విమర్శలు చేస్తున్నారా అని ఆరా తీస్తోంది.

అంతేకాదు కొద్ది రోజుల నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వైసీపీ కి చురకలు వేస్తూనే ఉన్నాడు.బీజేపీలో చేరే వాళ్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని అలా చేస్తే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు.వైసీపీతో తామేమి అంటకాగడంలేదని బీజేపీ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
బీజేపీ విషయంలో.జాగ్రత్తగా ఉండాలని జగన్ కూడా భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
అంతర్గతంగా ఆయన చేసుకుంటున్న ప్రయత్నాలు కూడా బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.తాజాగా బీసీ రిజర్వేషన్ అంశం గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా బీజేపీతో గట్టిగానే వాదనకు దిగడమే కాకుండా వాకవుట్ చేసి మరీ బయటకి వచ్చేయడం ఈ రెండు పార్టీల మధ్య సత్సబంధాలు అంతగా లేవు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.






