ఒకప్పుడు మన దేశంలో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవనాధారం సాగించే వారు.రైతులు మరియు రైతు కూలీలు ఎంతో మంది వ్యవసాయం చేసుకుంటూ జీవితం సాగించే వారు.
కాని పట్టణీకరణ వల్ల వ్యవసాయం చేసే వారు తగ్గి పోతున్నారు.వ్యవసాయ కూలీలు అసలు దొరకడం లేదు.
భూమిలేని వారు కూలీలుగా ఉండకుండా పట్టణంకు వెళ్లి పని చేసుకుంటూ జీవితంను సాగిస్తున్నారు.ఇలాంటి సమయంలో రైతులు కూడా వ్యవసాయంను వదిలేసే పరిస్థితి వచ్చింది.
అత్యంత దారుణమైన పరిస్థితులు ఇండియాలో కనిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలోనే కొందరు ఉన్నత విద్యావంతులు పెద్ద ఉద్యోగాలు చేసే వారు వ్యవసాయం చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు చూస్తూ ఉన్నాం.తాజాగా మరో టెక్కీ కూడా ఉద్యోగం వదిలేసి వ్యవసాయం దారి పట్టాడు.ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా బొబ్బెపల్లి గ్రామంలో శరత్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఉంటే గ్రామస్తులంతా కూడా నవ్వారు.
లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఇలా ఏంటీ అంటూ విమర్శలు చేశారు.అయితే అతడు పట్టుదలతో వ్యవసాయం చేసి కోట్ల రూపాయల పంట పండిస్తున్నాడు.

ఢిల్లీలో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఉండే శరత్ దానికి రాజీనామా చేసి వచ్చి తనకున్న భూమితో పాటు మరికొంత భూమి కవులుకు తీసుకుని పలు రకాల పంటలను వేయడం మొదలు పెట్టాడు.మొదట సంవత్సరం పాటు ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత అతడి దశ తిరిగింది.ఇప్పటి వరకు తన భూమిలో కోటిన్నర వరకు పంటను అతడు తీసినట్లుగా తెలుస్తోంది.ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బుల కంటే మూడు నాలుగు రెట్ల అధిక ఆధాయం ప్రస్తుతం తనకు వస్తుందని శరత్ అంటున్నాడు.
వ్యవసాయం దండగ కాదు, పండగ అంటూ ఈయన నిరూపించాడు.ఎంతో మంది యువకులకు శరత్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.







