కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, నాయకులూ తప్ప పెద్దగా కార్యకర్తల బలం లేని బీజేపీ పార్టీ ఏపీలో వైసీపీకి ప్రత్యామ్న్యా శక్తిగా ఎదగాలని చూస్తోంది.ప్రస్తుతం టీడీపీ బలహీనపడుతుండడంతో ఆ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుని లాభపడాలని ఆ పార్టీ భావిస్తోంది.
దీనికి సంబంధించి తగిన వ్యూహాలతో ముందుకు వెళ్తూ పార్టీలో చేరికలు ఉండేలా చూసుకుంటోంది.గడిచిన రెండు రోజులుగా మంగళగిరిలో బీజేపీ నేతలు రహస్యంగా మీటింగ్ పెట్టుకుని మరీ ఈ మిషన్‌కు సంబంధించిన కసరత్తు ముమ్మరం చేస్తున్నారు.
ఏపీలో బీజేపీ బలపడాలంటే ఏమి చేయాలి ? ఎటువంటి చర్యలు తీసుకుంటే పార్టీ అధికారం చేపట్టే స్థాయిలో బలపడుతుంది ? ప్రస్తుతం ఏ ఏ నేతలను పార్టీలో చేర్చుకోవాలి తదితర అంశాలకు సంబంధించి ఆ సమావేశంలో చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో బీజేపీ వేగంగా ఎదగాలంటే ఇతర పార్టీలనుంచి బలమైన నాయకులు, కార్యకర్తలు చేరాలని భావిస్తోంది.
ఆ వలసలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చేలా చేయడం ద్వారా రానున్న రోజుల్లో టీడీపీని మరింత బలహీనం చేసి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలని ప్లాన్ వేస్తోంది.అయితే ఈ క్రమంలో మెల్లి మెల్లిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీకి దూరం పెరుగుతున్నట్లు గా కనిపిస్తోంది.
రాష్ట్రంలో వేగంగా ఎదగాలంటే ఎప్పటికప్పుడు వైసీపీ తప్పులను ఎండగడుతూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని చూస్తోంది.కేవలం వలసలనే నమ్ముకుంటే పని జరగదనే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం కూడా ఇప్పటికే గుర్తించింది.

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆయన ఇప్పటికే బీజేపీ నేతలకు అమిత్ షా సూచించినట్టుగా తెలుస్తోంది.ఇటీవల బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే వారి అమిత్ షా సూచనలను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అండగా ఉండేది.తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే వ్యవహారాల్లో వైసీపీతో బీజేపీ కూడా గొంతు కలిపేది.టీడీపీని టార్గెట్ చేయడంలో వైసీపీకి చేదోడువాదోడుగా ఉండేది.ఎన్నికల తర్వాత కొన్నిరోజులు కూడా వైసీపీకి అనుకూలంగా బీజేపీ నేతలు మాట్లాడారు.
అయితే, ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంలో మాత్రం జగన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుబట్టారు.రాష్ట్ర బీజేపీ కీలక నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి సహా ఇతర నేతలు ప్రత్యేక హోదా విషయంలో జగన్ వైఖరిని పదేపదే విమర్శిస్తున్నారు.
ఇక రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య వైరం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.







