కొన్ని సార్లు చావు మనం కావాలనుకున్నా రాదు, కాని కొన్ని సార్లు మాత్రం మనం వద్దనుకున్నా వస్తుంది.కొన్ని సార్లు మనం చావుకు అతి సమీపంలో ఉన్నామని తెలుస్తుంది.
కాని ఆ చావు రాకుండా వెళ్లిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.నాలుగు సార్లు కూడా నేడు చనిపోతున్నాను అని, ఆ తర్వాత చనిపోకుండా వింతైన అనుభవంను ఎదుర్కొన్న వ్యక్తి కౌలా.
నాలుగు సార్లు కూడా ఉరి శిక్ష అమలు చేసే వ్యక్తి అలసి పోవడంతో కౌలాను ఉరి వేయకుండా వాయిదా వేశాడు.నాలుగు సార్లు ఆయన ముందు ఉన్న వ్యక్తులకు ఉరి శిక్ష వేసి చంపేశారు, కాని కౌలాకు మాత్రం ఉరి వేసే సమయానికి మావుటి వాడు ఏదో కారణం చెప్పి వెళ్లి పోయాడు.
దాంతో కౌలా ఉరి వాయిదా పడుతూ వచ్చింది.ఆ సమయంలోనే అక్కడ ఉరి శిక్షను రద్దు చేయడం జరిగింది.
దాంతో కౌలా నాలుగు సార్లు మరణం అంచుల వరకు వెళ్లాడు, చివరకు మళ్లీ వచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతంలోని ఒక చిన్న దేశం మలావీ.
ఆ దేశంలో కౌలా ఒక చిన్న వ్యవసాయ కేంద్రంను నడుపుతున్నాడు.ఆ వ్యవసాయ కేంద్రంలో పని చేస్తున్న ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది.
ఆ మరణంకు కారణం కౌలా అంటూ ఆరోపణలు వచ్చాయి.దాంతో అక్కడి రూల్ ప్రకారం ఉరి శిక్ష విధించడం జరిగింది.
హత్యలకు అక్కడ ఉరిశిక్ష ఉంటుంది.కౌలాకు కూడా ఉరి శిక్ష విధించారు.
ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఉరి శిక్ష అమలు చేసేందుకు ఒకే ఒక్క వ్యక్తి ఉంటాడు.ఆ ఒకే ఒక్క వ్యక్తి అన్ని దేశాలు తిరుగుతూ ఉరి శిక్షలు అమలు చేస్తూ ఉంటాడు.
అలా మాలావీలో కూడా ఆ వ్యక్తి ఉరి శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది.నెల రోజులకు ఒక సారి ఆ వ్యక్తి వస్తాడు.

కౌలా ఉరి శిక్ష రోజు రానే వచ్చింది.ఆ రోజు ఉరి శిక్ష వేసే వాడు వచ్చాడు.కౌలాతో పాటు అదే రోజు దాదాపు 40 మంది ఉరి శిక్షకు సిద్దంగా ఉన్నారు.దాదాపు 25 మందిని ఉరి తీసిన తర్వాత ఆ ఉరి తీసే వ్యక్తి శారీరకంగా, మానసికంగా చాలా అలసి పోయాడు.
దాంతో మళ్లీ తర్వాత వస్తానంటూ అతడు వెళ్లి పోయాడు.తర్వాత నెల రోజులకు వచ్చాడు.మళ్లీ కౌలా నిల్చున్నాడు.ఈసారి కూడా అతడి వంతు రాకముందే వెళ్లి పోయాడు.
అలా నాలుగు సార్లు జరిగి కౌలా ఉరి వాయిదా పడింది.ముఖ్యంగా నాల్గవ సారి ముందు వ్యక్తిని ఉరి తీశారు.
మరో నిమిషంలో ఉరి తీస్తారనగా, తన వల్ల కాదని ఉరి తీసే వ్యక్తి వెళ్లి పోయాడట.అలా నాల్గవ సారి కూడా బతికి బయట పడ్డాడు.

నియంత పాలనలో ఉన్న ఆ దేశంలో ప్రజాస్వామ్యం వచ్చింది.ప్రజాస్వామ్య పాలన వచ్చిన వెంటనే ఉరి శిక్షల అమలు నిలిపేయడం జరిగింది.అలా కౌలా తన ఉరి శిక్షను తప్పించుకుని, యావజ్జీవం అనుభవించి బయటపడ్డాడు.ప్రస్తుతం అతడు తల్లితో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు.







