అల్లుడుశీను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.వరుసగా భారీ చిత్రాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే ‘కవచం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇప్పటి వరకు పలువురు స్టార్ దర్శకులతో ఈయన వర్క్ చేశాడు.తండ్రి వెనకుండి నడిపిస్తున్న కారణంగా భారీ చిత్రాతో ఈయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇప్పుడు బెల్లంకొండ ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యాడు.కొన్ని సంవత్సరాల ముందు వరకు గణేష్ 90 కేజీల వరకు బరువు ఉండేవాడు.అయితే హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతో దాదాపు 30 కేజీల బరువు తగ్గినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తమ్ముడు గణేష్ కోసం అన్న శ్రీనివాస్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.మరో వైపు తెర వెనుక బెల్లంకొండ సురేష్ ఎలాగూ తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు.

బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందబోతున్న మొదటి సినిమా ఈనెల 24న లాంచనంగా ప్రారంభం కాబోతుంది.ఈ చిత్రానికి ఫణీ అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.ఒక విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని, మీడియం బడ్జెట్‌తోనే ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.అన్నయ్య గ్రాండ్‌గా లాంచ్ అయితే తమ్ముడు మాత్రం సింపుల్‌గా లాంచ్ కాబోతున్నాడు.
అయితే సింపుల్ గా లాంచ్ అయినా కూడా మంచి ట్యాలెంట్ ఉండి, అదృష్టం కలిసి వస్తే తప్పకుండా విజయాలను దక్కించుకోవడం ఖాయం.







