పూజ‌కు వాడిన పువ్వుల‌తో సేంద్రీయ ఎరువులు...ఇది క‌దా అస‌లైన ప‌ర‌మార్థం.!

మన దేశంలోని ఆల‌యాల్లో ఉన్న దేవుళ్లు, దేవ‌త‌ల‌కు నిత్యం భ‌క్తులు అనేక ర‌కాల పువ్వుల‌ను స‌మ‌ర్పిస్తుంటారు.దీంతోపాటు కొబ్బ‌రికాయ‌ల‌ను కొడుతుంటారు.

ఈ రెండింటి వ‌ల్ల ఎన్నో ల‌క్ష‌లు, కోట్ల ట‌న్నుల వ్య‌ర్థాలు నిత్యం ఆల‌యాల నుంచి ఉత్ప‌న్న‌మ‌వుతూనే ఉంటాయి.అయితే వ్య‌ర్థాలు వ‌చ్చే మాట వాస్త‌వ‌మే గానీ, వాటిని సరిగ్గా నాశ‌నం చేసే ప్ర‌క్రియ ఏదీ లేదు.

దీంతో ఎక్క‌డిక‌క్క‌డ వాటిని పారేస్తుంటారు.అయితే నిజానికి ఆలోచ‌న అంటూ ఉండాలి కానీ, ఏ వ్య‌ర్థాన్న‌యినా మ‌నం ఉప‌యోగించుకోవ‌చ్చు.

స‌రిగ్గా ఇదే ఆలోచ‌న చేశారు ఆ ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులు.అందుకే వారు అలా ఆల‌యాల్లో ఉత్ప‌న్న‌మ‌య్యే వ్య‌ర్థాల నుంచి ఏకంగా సేంద్రీయ ఎరువునే త‌యారు చేస్తున్నారు.

Advertisement

య‌ష్ భ‌ట్‌, అర్జున్ అనే ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులు గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఉన్న సిల్వ‌ర్ ఓక్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్య‌ను అభ్య‌సిస్తున్నారు.వీరు నిత్యం ఆల‌యాల్లో ఉత్ప‌న్న‌మ‌య్యే పువ్వులు, ఇత‌ర వ్య‌ర్థాల నుంచి సేంద్రీయ ఎరువుల‌ను త‌యారు చేసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు.ఈ క్ర‌మంలో వారు అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌హ‌కారంతో నిత్యం 300 కిలోల పువ్వులు, ఇత‌ర వ్య‌ర్థాల నుంచి 100 కిలోల ఎరువును త‌యారు చేస్తున్నారు.ఇలా త‌యారైన ఎరువును వారు కిలోకు రూ.60 చొప్పున విక్ర‌యిస్తున్నారు.

గుజ‌రాత్ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ (జీటీయూ)లో ఓ సారి జ‌రిగిన స‌ద‌స్సుకు య‌ష్‌, అర్జున్‌లు హాజ‌ర‌య్యారు.అక్క‌డ ఉప‌న్యాస‌కులు ఇంజినీరింగ్ విద్యార్థుల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ఇంజినీరింగ్ చ‌దువుతున్న విద్యార్థులు కొత్త‌గా ఏవైనా ప్రాజెక్టులు చేప‌ట్టాల‌ని, స‌మాజం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించేలా వారు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు చూపే నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేయాల‌ని సూచించారు.దీంతో అవే మాట‌ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకున్న ఆ ఇద్ద‌రు ఇలా దేవాల‌యాల్లో ఉత్ప‌న్న‌మయ్యే పువ్వులు, ఇత‌ర వ్య‌ర్థాల నుంచి ఎరువుల‌ను త‌యారు చేసే యంత్రాన్ని రూపొందించారు.

కాగా ప్ర‌స్తుతం వీరి ప్రాజెక్టు అహ్మదాబాద్‌లోని బొడ‌క్‌దెవ్‌, థాట్లెజ్‌, ఘ‌ట్లొడియా, న‌ర‌న్‌పురా, న‌వ‌రంగ్‌పుర ల‌లో ఉన్న 22 ఆల‌యాల ప‌రిధిలో కొన‌సాగుతోంది.త్వ‌ర‌లోనే అక్క‌డ మిగిలిన ప్రాంతాల్లోని ఆల‌యాల ప‌రిధిలోనూ ఈ ప్రాజెక్టును మ‌రింత విస్త‌రించ‌నున్నారు.

ఏది ఏమైనా ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో మేలు క‌లిగించే ఈ వినూత్నమైన ప్రాజెక్టును చేప‌ట్టినందుకు ఆ ఇద్ద‌రు ఇంజినీరింగ్ విద్యార్థులను అభినందించాల్సిందే క‌దా.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు