తెలంగాణలో అత్యంత ఉత్కంటభరితమైన రోజు రానే వచ్చేసింది.ప్రతీ ఐదేళ్లకి ఒకసారి రాజకీయ నాయకుడు రాసే పరీక్షలు రానే వచ్చేశాయి.
నేతల తలరాతలు మార్చేసే బలమైన ప్రజా ఆయుధం తెలంగాణా ఓటర్ల చేతిలో ప్రస్తుతం ఉంది.పరీక్షలకి ముందు విద్యార్ధులు, నిరుద్యోగులు ఎలాంటి అనుభవాన్ని అనుభావిస్తారో ఇప్పుడు రాజకీయ నేతలు సైతం ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కుంటున్నారు.
అయితే తెలంగాణలో ఈరోజు ప్రజలు వేయబోతున్న ఓట్లు ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయి…?? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది.?? అనే వివరాలలోకి వెళ్తే…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎన్నికలు జరగబోతున్నాయి.దాదాపు 1821 మంది అభ్యర్థులు తల రాతలని పరీక్షించుకోవడానికి సిద్దంగా ఉన్నారు.సుమారు 2.81 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.అయితే వీరిలో 1.41 కోట్ల మంది పురుష ఓటర్లు కాగా , మహిళా ఓటర్ల సంఖ్య సైతం 1.40 కి ఉంది.ఇందులోనే 7.5 లక్షల మంది ఓటర్లు మొట్టమొదటి సారిగా వోటు వేయనున్నారు.
ఇందుకోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లని చేపట్టింది.

ఇదిలాఉంటే 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం అయ్యింది.ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ జరుగనుంది.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా.95 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు…ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులు ఎన్నికల కమీషనర్ కి అందచేయటమే కాకుండా.ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపడుతున్నారు.

అయితే తమ పార్టీ గెలుస్తుంది అంటే తమ పార్టీ గెలుస్తుంది అంటూ ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తున్నారు.అయితే ఓటరు నాడి ఎలా ఉండబోతోంది, ఏపార్టీ కి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనే విషయాలపై గతంలో ఎన్ని సర్వేలు వచ్చినా సరే అవన్నీ ఇప్పుడు ఓటరుపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవని ఇప్పటికే తెలంగాణలో ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే అంచనాలకి వచ్చేశారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.