జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అడుగులు ఇంకా తప్పటడుగులుగానే పడుతున్నాయి.అయన రాజకీయ వ్యూహాలు, ఆయన పార్టీ ముందుకు వెళ్తున్న తీరు ఎవరికీ అంతు చిక్కడంలేదు.
ఒక వైపు చూస్తే ఎన్నికల సమయం ముంచుకొచ్చేస్తోంది.కానీ పవన్ కి మాత్రం ఇంకా ఏ విషయంలోనూ సరైన క్లారిటీ మాత్రం రాలేదు.
ఇంకా చూస్తా .చేస్తా అని చెప్పడం తప్ప మిగతా పార్టీలు ఇస్తున్నట్టుగా ఏ విషయంలోనూ క్లారిటీ మాత్రం ఇవ్వలేకపొతున్నాడు.పవన్ పై ప్రజల్లో ఇంకా సరైన నమ్మకమే కలగలేదు.ఇంకా అనుమానంగానే చూస్తున్నారు.కాదు కాదు అనుమానం కలిగేలా పవన్ స్వయంగా అవకాశం కల్పిస్తున్నారు.

పవన్ చాలా వ్యూహాత్మకంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాని అనుకుంటున్నారు.అందుకే వివాదాస్పద అంశాలపై దాటవేత ధోరణినే అనుసరిస్తున్నారు.అందుకే ఏ విషయంపైనా సరైన క్లారిటీ ఇవ్వకుండా నిపుణుల కమిటీ, అధ్యయన కమిటీ అంటూ తన నిర్ణయాలను వాయిదా వేస్తూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు.
తాజాగా కాపు రిజర్వేషన్ల పైనా పవన్ అవిధానాన్నే అవలంభించారు.
కాపు రిజర్వేషన్లపై జనసేన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు న్యాయ, రాజ్యాంగ నిపుణులు, మేధావులతో చర్చిస్తామని చెప్పారు.
ఇందుకు ఒక కమిటీని వేసేందుకు పవన్ సిద్ధమయ్యారు.దీంతో కాపు రిజర్వేషన్లపై పవన్ సూటిగా తన అభిప్రాయం చెప్పేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి.
కొంతకాలం క్రితం జరిగిన గుంటూరు సభలో రిజర్వేషన్ల అంశాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబు తెలిసినా రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు.

రిజర్వేషన్ల అంశం టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నదే.అది తెలిసి కూడా ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన ప్రతిహామీని అమలు చేయించే బాధ్యత తనది అని పవన్ ప్రచారం చేశారు.మరి టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్ల అంశంపై అప్పుడే పవన్ ప్రశ్నించి ఉంటే బాగుండేది.చంద్రబాబుతో కలిసి 2014లో పనిచేసి ఆ తర్వాత చంద్రబాబు వల్లే కులాల మధ్య చిచ్చు వచ్చిందంటే ఎలా?.ఏళ్ల తరబడి నడుస్తున్న ఆక్వాఫుడ్ పార్క్ వివాదం పైనా పవన్ ఈ మధ్య సమాధానం చెప్పకుండా అధ్యయనం చేసాక చెప్తాను అని చెప్పి తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్.? దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే పవన్ కి ఏ విషయంలోనూ స్పష్టమైన విధానం లేదని గాలివాటంగా తన రాజకీయ పయనాన్ని కొనసాగిస్తున్నాడు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి.







