రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నపంథాలు అవలంబిస్తున్నారు.ఒకరేమో ఉద్యమబాటలో ఉంటే, మరొకరేమో సైలెంట్ ఆటలో లీనమైపోయారు.
ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రధాని మోడీ తీరును టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగడుగునా ఎండగడుతుండగా.టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మిన్నుకుండిపోతున్నారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పదిరోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే.బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఎవరిపనుల్లో వారు ఉండిపోయారు.

అయితే, విభజన చట్టంలోని అంశాల అమలుకు ఉమ్మడిపోరు చేస్తే రెండు రాష్ట్రాలకూ లబ్ధి జరుగుతుందనే వాదన ఇప్పుడు ముందుకు వస్తోంది.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఉద్యమిస్తున్నారు.ధర్మపోరాట దీక్షలతో ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్ కుట్ర, లాలూచీ రాజకీయాలను ఎండగడుతున్నారు.అయితే, తెలంగాణలోని బయ్యారంలో, ఏపీలోని కడపలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో మళ్లీ రెండు రాష్ట్రాల ప్రజలు భగ్గమంటున్నారు. అయితే, ఇక్కడ ఇద్దరు చంద్రుల తీరుపైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
కడపలో సీఎం రమేశ్ పదిరోజులుగా ఆమరణ దీక్ష చేస్తుండగా… ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు.ఈ రోజు సీఎం రమేశ్‌కు చంద్రబాబు సంఘీభావం తెలుపుతున్నారు.
అయితే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనే అనేక అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఇటీవల మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి కోరారు.
అంతేతప్ప, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్దగా ప్రయత్నం చేసిందని లేదని స్థానికులు అంటున్నారు.ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై కూడా విమర్శలు వచ్చిపడుతున్నాయి.కేంద్రంపై ఉద్యమించకుండా.ఇలా సైలెంట్‌గా ఉండిపోవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే, సీఎం కేసీఆర్ మోడీకి దగ్గరగా ఉంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.ఇందులో భాగంగానే టీఆర్ఎస్ నేతలు సైలెంట్‌గా ఉండిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
గులాబీ బాస్ తీరుతో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి.







