రేపో మాపో విస్తరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఏపీ మంత్రి వర్గం విషయంలో రోజు రోజుకు ఆసక్తికర వార్తలు వెలుగు చూస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు ఎవరెవరికి ఉద్వాసన తప్పదో.
ఎవరెవరికి మంగళం పాడతారో పేర్లతో సహా వార్తలు వెలుగు చూడడం తెలిసిందే.
ఇక, ఇప్పుడు తాజాగా చంద్రబాబు కూటమిలో ఏయే మంత్రులకు ఇబ్బంది లేదో? ఏయే మంత్రులు స్వేచ్ఛగా ఉన్నారో వివరిస్తూ.మరో కథనం వెలుగు చూసింది.ఇప్పుడు చెప్పబోయే మంత్రులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని తెలుస్తోంది.చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ఎంత మంది కొత్తవారితో విస్తరించినా.ఇప్పుడు చెప్పుకొనే మంత్రులకు ఏమీ కాదని, బాబు వీరిని ఎట్టి పరిస్థితిలోనూ విడిచి పెట్టరని అంటున్నారు విశ్లేషకులు.
సేఫ్ జోన్‌లో ఉన్నవాళ్లలో యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వాళ్ల జోలికి సీఎం చంద్రబాబు వెళ్లరని తెలుస్తోంది.దీనికి ప్రధాన కారణం వారి వారి రాజకీయ, సామర్థ్య నేపథ్యమేనని అంటున్నారు.
వీరందరి కుటుంబాలూ టీడీపీతో మమేకం అయిపోయి ఉన్నాయి.
వీరి కుటుంబాల్లోని వ్యక్తులు పార్టీ కోసం, ముఖ్యంగా చంద్రబాబు కోసం ఎన్నో త్యాగాలు చేశారు.
వీరిలో అత్యంత ముఖ్యమైన యనమల రామకృష్ణుడు ఎప్పటి నుంచో బాబుకు విధేయుడిగా ఉన్నారు.పరిటాల సునీత కుటుంబం మొత్తం టీడీపీకే అంకితం, అదీగాక, ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, పౌరసరఫరాల శాఖను పరుగులు పెట్టించడంలో ఆమె ఎంతగానో శ్రమిస్తోంది.
అదేవిధంగా మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఎన్నో ఏళ్లుగా టీడీపీనే అంటి పెట్టుకున్నారు.పార్టీ పదేళ్లు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన బాబు వెంటే నడిచారు.
అదేవిధంగా మంత్రి దేవినేని కూడా బాబు దగ్గర మంచి మార్కులే కొట్టేశారు.ఇక, హోం శాఖ మంత్రి చినరాజప్పకు కూడా బాబు దగ్గర మంచి పేరుంది.
ఆయన వచ్చాక క్రైం రేటు తగ్గిందని బాబు అంతర్గత సమావేశాల్లో కొనియాడారు.ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని ఎదుర్కోవడంలో చినరాజప్ప చొరవ సీఎంను కట్టిపడేసింది.
గడిచిన 35 ఏళ్లుగా రాజప్ప టీడీపీలోనే కొనసాగుతున్నారు.
ఇక, ఉత్తరాంధ్రలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న అచ్చెన్నాయుడు కూడా తన కు అప్పగించిన పనిని పూర్తి సంతృప్తితో చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.
ముఖ్యంగా అసెంబ్లీలో జగన్‌పై విరుచుకుపడడంలో అచ్చెన్నాయడుకి సాటి మరెవరూ లేరనే రేంజ్‌లో ఉంది పరిస్థితి.ఈయన అన్న ఎర్రన్నాయుడు టీడీపీని బలోపేతం చేయడం కోసం ఉత్తరాంధ్రలో విపరీతంగా కష్టపడ్డాడు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వీరందనీ కదిలించే ప్రయత్నం చేయబోరని సమాచారం.మరి ఏం జరుగుతుందో చూడాలి.







