ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది.ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ పరిపాలన పరంగా తన సమర్థతను నిరూపించుకుంటూ ప్రజలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నా, పార్టీ నాయకుల్లో మాత్రం జగన్ తీరుపై అసంతృప్తి కనిపిస్తోంది.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులలో ఎక్కడా ఆ ఉత్సాహం కనిపించడం లేదు.ఎవరికి వారు పార్టీలో పరిస్థితులను గుర్తు చేస్తూ , అప్పుడప్పుడు బహిరంగంగానే విమర్శలకు తిరుగుతూ ఉండటం వంటి వ్యవహారాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి.
పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కష్టపడినా, నాయకులంతా ఇప్పుడు పార్టీ పైన అసంతృప్తి వెళ్లగక్కుతూ బహిరంగంగా విమర్శలు చేసే వరకు పరిస్థితి రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.అసలు జగన్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అధికారం వైపు నడిపించే వరకు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇతర పార్టీల వేధింపులను తట్టుకుని పార్టీ కోసం కష్ట పడిన వారు ఎంతో మంది ఉన్నారు.ఇక ఎంతోమంది, ఎన్నో కేసులో ఇరుక్కోవడం తో పాటు జైలుపాలు అయ్యారు.
అలాగే జగన్ సైతం 16 నెలల పాటు జైలు జీవితం గడిపి వచ్చారు.ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో అధికారంలోకి పార్టీ ని తీసుకు వచ్చిన నాయకులలో మాత్రం, ఎప్పుడు లేనంత నిరుత్సాహం అలుము కోవడం, జగన్ తీరు పైన తమ అసంతృప్తి వెళ్లగక్కడం, వంటి వ్యవహారాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.
జగన్ తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా కాలంగా గుర్రుగా ఉంటున్నారు.

నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను గురించి, ప్రస్తావించి, అనేక విషయాలపై చర్చిద్దామని ప్రయత్నిస్తున్నా, జగన్ తమకు అవకాశం ఇవ్వడం లేదని, దీని కారణంగా ప్రజల్లో చులకన అవుతున్నామని, ప్రభుత్వానికి సంబంధించిన చాలా విషయాలలో తమ ప్రమేయం లేకుండానే మొత్తం అధికారులతో తతంగమంతా నడిపించేస్తున్నారని ,దీని కారణంగా ప్రజలలో తమ పలుకుబడి బాగా తగ్గిపోయి ,తమకు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, ఇలా ఎన్నో రకాల అసంతృప్తుల తో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారట.అసంతృప్తి ఈ స్థాయిలో ఉండబట్టే, చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.అప్పటి నుంచి ఈ రకమైన అసంతృప్తి వ్యవహారాలపై చర్చ జరుగుతున్నా, ఈ అసంతృప్తి వ్యవహారాలను కట్టడిచేసే విషయంపై జగన్ దృష్టి సారించినట్లు గా కనిపించడం లేదు.