ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగ నున్న నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు.తన పార్టీ శాసన సభ్యులను అధికారపార్టీ ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేలని వారి కుటుంబ సభ్యులతో సహా కేరళ, గోవా రాష్ట్రాలతో పాటు ఇతర పర్యాటక కేంద్రాలకు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికే వైసీపీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఇరవైకి దాటుతుండటంతో మీడియా కంటికి సైతం దూరంగా ఉండేలా ఈ క్యాంపులకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.రెండు బృందాలుగా తరలి వెల్లిన ఎమ్మెల్యేలకు అయ్యే ఖర్చును పార్టీయే భరిస్తుందని ఓ నాయకుడు తెలిపారు.
కాగా మహానాడు తదుపరి రాజ్యసభ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించేందుకు సిద్ధం అవుతారని, ఇప్పటికే టచ్‌లో ఉన్నవారికి తోడు మరి కొందరిని తమ వైపుకు తిప్పుకునేందుకు అవకాశాలున్నట్టు స్పస్టమైన సమాచారం అందటంతోనే ఈఎమ్మెల్యేల తరలింపు కార్యక్రమం జరిగి ఉండొచ్చని రాజకీయ వర్గాల విశ్లేషణ.







