కొన్ని సందర్భాలలో కొంత మందిని చూస్తే అరె ఎంతటి దారుణమైన పరిస్థితులో ఉన్నారు.ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు అనుకుంటారు.
కదల్లేక, మెదల్లేక, చావాలేక బతకలేక అన్నట్టుగా ఉంటుంది వారి పరిస్థితి.మంచాన పడ్డ చాలా మందికి ఇంట్లో వాళ్లు చాకిరి చేసి చేసి ఎప్పుడు చస్తారు అన్నట్టుగానే చూసే వారు కూడా ఉంటారు.
చాకిరి చేయించుకోలేక వారి మాటలు పడలేక దేవుడా నాకు ఇంక ఈ బతుకు చాలు నన్ను తీసుకెళ్లు అని ప్రతి గడియ గడియకు వాళ్లు మదన పడుతూనే ఉంటారు.రోగాలతో మంచాన పడ్డ వారికి సరిగ్గా పెయిన్ కిల్లర్స్, సెడిటివ్స్ పనిచేయవు.
పైగా ఇవి వ్యసనంలా తయారవుతాయి.ఈ సమయంలో మెర్సీ కిల్లింగ్ - అంటే కారుణ్య మరణమే మంచిది అనిపిస్తుంది.
తలకు తగిలిన తీవ్రగాయాలతో కొంత మంది జీవితాంతం మంచాన ఉండిపోతారు.వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు.
స్పందనలు ఉండవు.వెజిటేటివ్ బ్రెయిన్ అంటారు.
అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్‌తో కొంతమంది బయటిప్రపంచంతో సంబంధం లేకుండా మంచాన అచేతనంగా ఉండిపోయి, మందులకు కూడా స్పందించకుండా, నయం కాని జబ్బులతో దీర్ఘకాలం బాధపడుతుంటారు.ఇటువంటి వారి విషయంలో కారుణ్య మరణమే పరిష్కారం అని అంతా భావిస్తున్నరా.
భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ అంటే- కారుణ్య మరణాలకు అనుమతిస్తే దుర్వినియోగమవుతుందనే అపోహలు ఉన్నాయి.కాని ఇందులో నిజం లేదు.
ఏ విధానంలోనైనా ఎక్కువ శాతం సమాజానికి ఉపయోగం ఉంటుందా అనే కోణంలో చూడాలి.సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇండిపెండెంట్ బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
ఇందులో వైద్య నిపుణులు, న్యాయ కోవిదులు, సామాజిక కార్యకర్తలు, ఎన్‌జివో సంఘాల నేతలు ఉండాలి.ఆసుపత్రి యాజమాన్యం, రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు ఈ బోర్డులో ఉండరాదు.
వారు నిర్ణయం మేరకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి.కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చే ముందు కుటుంబ సభ్యులు సమ్మతిని తీసుకోవాలి.
ఏళ్లతరబడి నయం కాని వ్యాధులతో, నిరంతరం బాధపడే రోగుల వల్ల ఆర్ధికంగా కుటుంబం చిన్నాభిన్నమవుతుందనే సున్నిత మైన విషయాన్ని గుర్తుంచుకోవాలి.వెంటిలేటర్లపై మనం కొంత మంది రోగులను పెడుతుంటాం.
ఎంత కాలమని దాని ద్వారా రోగులు జీవించగలరు.చట్టాలను దుర్వినియోగం చేయకుండా పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేయాలి.
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేస్ టు కేస్ స్టడీ చేసి కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.ఎటువంటి లోపాలకు తావులేకుండా మార్గదర్శక సూత్రాలు ఖరారు చేసుకోవాలి.
అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల వైద్యం అందించిన తర్వాత రోగి కోలుకోని దశలో, లోకంతో సంబంధంలేని స్ధితికి రోగి చేరుకున్నప్పుడు, కారుణ్య మరణం ఒకటే ప్రత్యామ్నాయ మార్గం.ఒక్కమాటలో చెప్పాలంటే వైద్యపరంగా అన్ని మార్గాలు మూసుకునిపోయిన తర్వాత కారుణ్య మరణం విషయాన్ని వైద్యులు, రోగి బంధువులు పరిశీలించాలి.
కారుణ్య మరణాలకు అనుమతి ఇచ్చే విషయమై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎన్‌జివో సంఘాలు విస్తృత స్ధాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి.మనదేశంలో చాలా మందికి మెర్సీ కిల్లింగ్ గురించి తెలియదు.
సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణగా చట్టాలను రూపొందించే ముందు ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరం.మరణం అతి బాధాకరమైనది- మరీ ముఖ్యంగా మృతుల దగ్గరివారికి.
కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల జీవితమూ అత్యంత బాధాకరంగా ఉంటుంది.అటువంటి సందర్భాల్లో చావే నయం అనిపిస్తుంది కూడా.
కానీ ఇటు జీవితంపై ఆశ, దగ్గరివారి ప్రేమ, వైద్యుల సేవలూ జీవితాన్ని కొనసాగనిస్తుంటాయి.కానీ బాధ కూడా కొనసాగుతూనే ఉంటుంది.
ఆ వ్యక్తి పడే దుర్భర వేదన చూసిన వాళ్లందర్నీ కదిలిస్తుంది.కలచివేస్తుంది.
ఆ సమయంలో ఎవరైనా చేయగల సహాయం ఏదైనా ఉంటే అది ఆ వ్యక్తికి మరణాన్ని ప్రసాదించడమే! కనీసం ఆ వ్యక్తికి వేదనను తగ్గించిన వారమయ్యామనే భావన ఉంటుంది.కానీ మరణాన్ని ప్రసాదించడం ఎలా? మరణాన్ని ఏ రకంగా కలిగించినా అది అమానుషమే కదా.హత్యే కదా.ఘోరమే కదా? అయితే ఇక్కడ మనం గమనించవలసింది అవతలి బాధితుడు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడన్నది.శారీరక, తద్వారా మానసిక వేదనకు గురైనప్పుడు, ఆ వేదనను మానవ ప్రయత్నాలు తగ్గించలేనప్పుడు, మరో దారి లేనప్పుడు, బాధతో జీవించడమా, బాధైనా మరణించడమా అన్న మీమాంసలో మరణమే మంచిదని కొందరి వాదన.
అలా వచ్చిందే ఈ మెర్సీ కిల్లింగ్.ఒకప్పుడు హిపోక్రటీస్ ఏమన్నాడనేది గుర్తు చేసుకుందాం.నా అంతట నేను గానీ, రోగి కోరినా గానీ, మరెవరైనా సలహా ఇచ్చినా గానీ నేను ఎవరికీ ప్రాణాంతకమైన మందును ఇవ్వను.
వైద్యశాస్త్రం చదివిన వారు చేసే హిపోక్రటీస్ ప్రతిజ్ఞ లోని ఒక వాక్యం ఇది.క్రీస్తుకు పూర్వం 400 ఏళ్ల క్రితమే వైద్యశాస్త్ర పితామహుడు హిపోక్రటీస్ రూపొందించిన ప్రతిజ్ఞ ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు వారి బాధ్యతలను గుర్తుచేసే దిక్సూచి.అయితే ప్రాచీన రోమన్లు, గ్రీకుల అభిప్రాయం వేరుగా ఉందేది.
వారి దృష్టిలో జీవించడం ఇష్టంలేని వారికి, మరణం కోరుకున్న వారికి మరణాన్ని ఇవ్వడం మంచిదే.కానీ పధ్నాలుగవ శతాబ్దంలో ఆత్మహత్య, లేదా ఆత్మహత్యకు తోడ్పడడం నేరాలుగా పరిగణించారు.
న్యూయార్కులో 1828లోనే యుథనేసియాకి వ్యతిరేకంగా చట్టం చేయబడింది.ఈ మెర్సీ కిల్లింగ్ లో రెండు రకాలున్నాయి.
స్వచ్ఛందంగా వ్యక్తి కోరే మరణం.మరోటి ఆ వ్యక్తికి వేదన తగ్గించే ప్రయత్నంగా ఇతరులు కలిగించే మరణం.
పంతొమ్మిది వందల ముప్ఫయ్యవ దశకంలో హిట్లరు రెండవ రకపు యుథనేసియాని విరివిగా అవలంభించాడు.యాక్షన్ టి4 అనే పేరుతో నాజీలు జీవించడానికి తగని జీవితాన్ని నిర్మూలించే కార్యక్రమం చేపట్టారు.
హిట్లరు స్వయంగా ఆ పనికి ఆదేశించాడు.తొలుత వారి దృష్టి పసిపిల్లలపై ఉండేది.
బుద్ధిమాంద్యం, అవిటితనం వంటి లక్షణాలున్న పిల్లల్ని చంపేసేవారు.ఆ తరువాత దీర్ఘకాల వ్యాధులతో నయం కాని జబ్బులతో ఉన్న వారిని కూడా అతి జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత కారుణ్య మరణాన్ని ప్రసాదించవలసిందని హిట్లరు ఆదేశాలు జారీ చేశాడు.1945 కల్లా సుమారు మూడు లక్షల మంది జర్మన్లు ఆ విధంగా చనిపోయారు.అరుణా రామచంద్ర శాన్‌బాగ్ ముంబై లోని కె.ఇ.ఎమ్ ఆసుపత్రిలో పనిచేసే ఉపచారిక.నవంబరు 27, 1973 రాత్రి అదే ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న సోహన్ లాల్ వాల్మీకి ఆమెను కుక్క గొలుసుతో గొంతు బిగించి, అత్యాచారం జరిపాడు.
మెడకు బిగిసిన చెయిన్ మెదడుకు ప్రాణవాయువు సరఫరా తగ్గించిన కారణంగా ఆమె సంపూర్ణంగా నిర్వీర్యమైపోయింది.అప్పటి నుండి అరుణ ఆసుపత్రి మంచానికే అంకితమైపోయింది.నోటి ద్వారా మెత్తని భోజనం పంపడం నుండి సకల సపర్యలూ మంచం మీదనే.
ఆహారం తీసుకోవడం అన్న ఒక్క అంశం మినహా ఆమె ఏ కోణంలోనూ మానవ జీవితం అనుభవించడం లేదన్నది పింకీ విరానీ అనే జర్నలిస్టు వాదన.ఆ కారణంగా అరుణకు కారుణ్య మరణం ప్రసాదించమని ఆమె కోర్టును కోరింది.
కానీ కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది.అయితే ప్రాణాలు హరించే దిశగా మందులు ఇచ్చేకన్నా కీలకమైన మందులు, వైద్యం, ఆహారం వంటివి ఆపేయడం ద్వారా మరణాన్ని ఇవ్వవచ్చన్న తీర్పు సంచలనం రేపింది.
ఇంతకాలం అరుణను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆమె సహోద్యోగులు ఈ తీర్పుతో ఆనందం వెలిబుచ్చారు.అరుణ ఒక చంటిపాపలా ఉంది.
మాలాగే ఆమెకీ వయసు పెరుగుతోంది.ఆమె మాకేమీ భారం కాదు.
ఇబ్బందీ కాదు.ఆమెకు సపర్యలు చేయడం మాకెంతో సంతోషం.
ఆమె ప్రాణాలు తీయడానికి మేం ఒప్పుకోం.కోర్టు ఈ కేసు కొట్టేసినందుకు సంతోషం అన్నారు.
అసలు ఈ మరణాన్ని చట్టబద్ధం చేసిన దేశాలు ఏవి అనుకుంటున్నారా? కారుణ్య మరణాలపై భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉన్నాయి.గత శతాబ్దపు ముప్ఫయ్యవ దశకాల్లోనే యుథనేసియాకి అనుకూలంగా కొన్ని సంస్థలు ఏర్పాటయ్యాయి.
ఆస్ట్రేలియాలో 1995లో అనుకూలంగా ఒక బిల్లు ప్రవేశపెట్టారు.అది 1996లో అమల్లోకి వచ్చింది.
ఆ మరుసటి ఏడు నిషేధించారు! అమెరికాలో 1998లో ఓరిగాన్ రాష్ట్రంలో యుథనేసియా చట్టబద్ధం చేయబడింది.రెండు వేల సంవత్సరంలో నెదర్లాండ్ యుథనేసియాని చట్టబద్ధం చేసి, అలా చేసిన తొలి దేశంగా నిలిచింది.
ఈనాడు బెల్జియం, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ దేశాలు కూడా నెదర్లాండ్ సరసన చేరాయి.అమెరికాలో ఓరిగాన్ సరసన వాషింగ్టన్ రాష్ట్రం చేరింది.
మరి మన దేశంలో ఈ మెర్సీ కిల్లింగ్ అమలులో ఉందా అంటే.మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు పాజిటివ్ కారుణ్య మరణాన్ని అవలంభించ వచ్చని చెప్పింది.మార్చి 9, 2018నభారత సుప్రీంకోర్టు నుండి కఠినమైన మార్గదర్శకాల ప్రకారం కారుణ్య మరణం భారతదేశంలో చట్టబద్దం చేశారు.
కారుణ్య మరణాలు ఎంత వరకు సమంజసం అన్నది ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్న.ఒక మూడు నాలుగు దశాబ్దాల కిందట అబార్షన్ అనేది తల్లి ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే అవసరమైన ప్రక్రియగా వాదించేవారు.
కానీ ఇప్పుడు తొందరపాటు గర్భాలనీ, అవాంఛనీయ గర్భాల్నీ తొలగించుకోవడానికీ అబార్షన్లు సాధారణమైపోయాయి.తోటి మనిషి బాధలో ఉంటే ఆ బాధ తొలగించే ప్రయత్నాలు చేయడం మానవీయత.ఆ ప్రయత్నాలు విఫలమైతే, ఆ బాధ ప్రకోపిస్తే, ఆ బాధితుడు కోరితే అతనిని ఆ బాధ నుండి, ఆ జీవితం నుండి విముక్తుణ్ణి చేయడం కూడా మానవీయతే అంటారు కొందరు.
అసలు ప్రాణాలు తీసే హక్కు వైద్యులకు ఎవరిచ్చారంటారు ఇంకొందరు.వైద్యం ఉన్నది బాధితులకు సుఖాన్నివ్వడానికే.
అంటే బాధను తొలగించడానికే.ఆ తొలగింపు మరణం వల్లనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు ఆ మరణాన్ని త్వరితం చేసి వేదనను తగ్గించడం మంచిదే కదా అన్నది కొందరి సూచన.
ఈ సమస్య ఇలా ఎప్పటికీ జటిలంగానే ఉంటుంది.కారణం నిర్ణయాధిక పేషెంటు కోరినంత మాత్రాన చంపేయవచ్చా? తీవ్రమైన బాధను నిర్ణయించేది ఎవరు? ఆత్మహత్యకు పురిగొల్పే పరిస్థితులన్నీ ఆయా వ్యక్తులకు తీవ్రమైనవే! పరీక్షలో తప్పడం, ప్రేమ విఫలమవడం, అమ్మ తిట్టడం, డిప్రెషన్, ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఒంట్లో అనేక సమస్యలు వంటివి ఆ పరిస్థితులను భరించలేనివే.ఆ కారణాలను సాకు చేసుకుని భరింపరాని మానసిక బాధ ఉంది డాక్టర్, ఒక ఇంజెక్షన్ ఇచ్చి, చంపేసి పుణ్యం కట్టుకోండి అని ఎవరూ వెళ్లరా? ఫీజు తీసుకుని డాక్టర్లు కారుణ్య మరణాలు సునాయాసంగా ప్రసాదించవచ్చు! అలాంటప్పుడు ఈ మెర్సీ కిల్లింగ్ కు వ్యతిరేకత అధికంగా ఉంటుంది.కానీ అందరికీ అందుబాటులో లేని వైద్యం వల్ల చాలా వ్యాధులు ముదిరి దీర్ఘకాలిక పరిస్థితులుగా మారుతున్నాయి.
వైద్య ఖర్చులు తగ్గించుకునే లేదా మిగుల్చుకునే నెపంతో కూడా రోగులు మరణాన్ని కోరుతున్నారు.అయితే చిత్తూరు జిల్లాలో ఒక బిడ్డ కోసం తల్లిదండ్రులు గతంలో ఈ కారుణ్య మరణం కోసం కోర్టును ఆశ్రయించారు.
పుట్టిన పాపను కాపాడుకోలేక ఆమె బాధను చూడలేక తల్లడిల్లిన తల్లిదండ్రి ఆవేదనతో కోర్టుకు ఎక్కారు.ఆమెను బతికించాలి అంటే నెలకు రూ.10వేలు ఖర్చు అవుతోంది అని ఇప్పటికే పుట్టెడు అప్పుచేశామని ఇక వారితో అవడం లేదని కోర్టును ఆశ్రయించారు.అయితే న్యాయాధికారి హాస్పత్రి బిల్లులను తేవాలని కోరారు.
అసలు ఇది చట్టబద్ధమా! కాదా! అనే ప్రశ్నకు వస్తే చాలా విషయాలు ఉన్నాయి.అయినా, మనకి కారుణ్య మరణం చట్టబద్ధమా కాదా అన్న సమస్య లేదు.
సరైన వైద్యం సకాలంలో అందక చనిపోయేవారు కోకొల్లలు.అసమర్థ వైద్యుల కారణంగా వైద్యం వికటించి ప్రాణాలు విడిచినవారు అసంఖ్యాకులు.
డబ్బిస్తే తప్ప మందివ్వననే జబ్బున్న డాక్టర్ల చేతిలో హరీమన్న వాళ్లకు లెక్కలేదు.పెంపుడు జంతువులు, రేసుగుర్రాలు గాయాలతో విలవిల్లాడుతుంటే యజమానులు వాటిని చంపి వాటికి బాధావిముక్తి కలిగించేవారు.
యుద్ధాల్లో తోటి సైనికులు దెబ్బలతో అల్లాడిపోతుంటే వారికి చావు ద్వారా సుఖాన్ని ఇవ్వడం మామూలే.కానీ సాధారణ పౌరుల జీవించే హక్కుకి గౌరవమివ్వాలా? వారు కోరే మరణానికి విలువ ఇవ్వాలా? అన్నది తేలని సమస్య.కరుణ చూపవలసింది జీవితం వైపా? మరణం వైపా? ఎవరి దృష్టి వారిది.మెర్సీ కిల్లింగ్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చట్టం యొక్క అనుమతితో తీసుకోవాల్సిన చర్య.
గతంలో కూడా చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులివ్వడానికి నిరాకరించిన సందర్భాలున్నాయి.బ్రెయిన్ డెడ్ అయితేనే ఇలాంటి చర్యలకు అనుమనిచ్చారు.అసవు ఈ మెర్సీ కిల్లింగ్ వల్ల నష్టాలు ఏంటి.
ఎవరైనా మిస్ యూస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా అంటే అవునని కూడా కొందరి వాదన.మెర్సీకిల్లింగు ను అనుమతిస్తే కావాలని చంపి మెర్సీకిల్లింగు గా చిత్రించే అవకాశం ఎక్కువ.
ఎవరోకాదు సొంత బంధువులే చేస్తారు కొన్నిసందర్భాలలో.అన్నదమ్ముల ఆస్తితగాదా కేసులతోనే కోర్టు లన్నీ నిండిపోయాయి.
ముసలివాళ్ళ ఆస్తులు లాగేసుకొని బయటకు గెంటేస్తున్నారు.ఈ మెర్సీకిల్లింగు ను అనుమతిస్తే ఇక అది మెరుపు తీగ అయిపోతుంది అని మరికొందరి వాదన.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy