తెలంగాణలో శక్తివంతమైన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఒకరు.ఆయన ఏదైనా పనిని తలపెట్టారంటే ముగించేవరకు వదిలిపెట్టరనే నానుడి ఉంది.
అయితే తాజాగా రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది.వచ్చేనెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ సడెన్‌గా మంత్రులతో, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు లేదా రాష్ట్ర రాజకీయాలపై ఏదో ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఇటీవల పరిణామాలను గమనిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారని చెప్పవచ్చు.అందులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు ముఖ్య నేతలను కలిసి మంతనాలు జరిపారు.
శివసేన, ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆప్ వంటి పార్టీల నేతలతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించారు.అందరూ కలిసికట్టుగా ముందుకు సాగేలా నిర్ణయించారు.
ఈ సందర్భంగా రెండు, మూడు నెలల్లో సంచలన ప్రకటన ఉంటుందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే ఇటీవల కొద్దిరోజుల పాటు ఫాంహౌస్‌కే కేసీఆర్ పరిమితం అయ్యారు.
అక్కడ ప్రశాంత్ కిషోర్ సహా పలువురు ప్రముఖులను కూడా కలిశారని వార్తలు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికపైనే కేసీఆర్ మంతనాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బీజేపీతో వ్యతిరేక రాజకీయాలను కేసీఆర్ నడుపుతున్నారు.దీంతో కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారన్న అంశం ఆసక్తి రేపుతోంది.
కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతు ఇస్తారా? లేదా? అనేది మంత్రులతో సమావేశంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నిక కోసం తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించాయి.ఈ మేరకు ఆయా పార్టీలు తమ దగ్గర ఉన్న ఆప్షన్‌లను సిద్ధం చేసుకున్నారు.ముందుగా ఎన్డీఏ తమ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత తమ నిర్ణయం ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థికి మద్దతు తెలిపే విషయంలో పలు పార్టీలతో ప్రాథమికంగా చర్చలు కూడా జరిపిందని తెలుస్తోంది.దీంతో ప్రాంతీయ పార్టీల విషయంలో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ కీలకంగా మారారు.







