చైనాలో ( China )ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షా రైల్వే స్టేషన్‌లో ( Changsha Railway Station in Hunan Province )ఫిబ్రవరి 4న ఓ 40 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు.అది చైనాలో వారం రోజుల పాటు జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల చివరి రోజు కావడంతో అందరూ ఇంటికి వెళ్లే హడావిడిలో ఉన్నారు.
ఇంతలో ఈ ఘటన జరగడంతో స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అయితే గుండెపోటుతో పడిపోయిన వ్యక్తి కాసేపటికి స్పృహలోకి వచ్చాడు.అందరూ ఏం జరిగిందో అని కంగారు పడుతుంటే, అతడు మాత్రం నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాటలు విని అందరూ షాక్ అయ్యారు.“నేను ఆఫీసుకు వెళ్లాలి, తొందరగా వెళ్లాలి” అంటూ ఆ వ్యక్తి కంగారు పడ్డాడు.అంతేకాదు వెంటనే “నేను హై-స్పీడ్ ట్రైన్‌లో వెళ్లాలి, ఆఫీసుకు లేట్ అవుతుంది” అని కూడా అన్నాడట.లేచి కొంత దూరం కూడా పరిగెత్తాడట.అతడి మాటలు విన్నవాళ్లంతా అవాక్కయ్యారు.గుండెపోటు వచ్చి పడిపోతే ఆసుపత్రికి వెళ్లాలి అనే ఆలోచన కూడా అతనికి రాలేదు.

రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న ఓ డాక్టర్ వెంటనే స్పందించి అతనికి సాయం చేశారు.దాదాపు 20 నిమిషాల తర్వాత అతడు పూర్తిగా స్పృహలోకి వచ్చాడు.అయితే, డాక్టర్ మాత్రం గుండెపోటుతో పడిపోవడం వల్ల ఇతర గాయాలు కూడా అయ్యే అవకాశం ఉందని, వెంటనే ఆసుపత్రికి వెళ్లి పూర్తి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.మొదట ఆ వ్యక్తి ఒప్పుకోకపోయినా, తర్వాత అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించాడు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.చాలా మంది నెటిజన్లు ఆ వ్యక్తి పరిస్థితికి కనెక్ట్ అయ్యారు.చైనాలో ఆర్థిక ఒత్తిడి, ఉద్యోగ భారం పెరిగిపోవడంతో చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు.“అయ్యో పాపం, లేవగానే డబ్బు గురించే ఆలోచిస్తున్నాడు.చాలా బాధగా ఉంది.” అని ఒకరు కామెంట్ చేస్తే, “అతడు ఒక్కడే కాదు, చాలా మందిమి ఇలాగే బతుకుతున్నాం.ఇంటి లోన్లు, పిల్లల చదువులు.ఎవరికీ జీవితం సులువుగా లేదు” అని మరొకరు రాసుకొచ్చారు.