నిత్యం తొండి మాటలు చెబుతూ… గ్రామాల్లో తిరుగుతూ రైతన్నలను మోసం చేస్తున్న బిజెపి నేతలను ఊర్లకు రానివ్వకుండా తరిమికొట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పిలుపు ఇచ్చారు.పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఒకరు, ఆదివాసీలకే రిజర్వేషన్లు ఉంటాయని చెప్పి మరొకరు అబద్ధాలతో ఎంపీలు అయ్యారని, ఇంకా అవే అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని, వీరి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండగ చేసి, రైతుని రాజు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నిలబడాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా, దాట్ల గ్రామ సర్పంచ్ కొమ్మినేని రవీందర్ రావు గారి తండ్రి కొమ్మినేని పెద్ద అంతయ్య పటేల్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నేడు వారి నివాసానికి వెళ్లి, ఆయన చిత్ర పటం వద్ద రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.అమావాస్యకు, పున్నానికి వచ్చే కొన్ని రాజకీయ పార్టీల నేతలకు సరైన బుద్ధి చెప్పాలి.ఈ ప్రాంత అవసరాలు తెలిసి, అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి అండగా ఉండాలని కోరుతున్నాను.తొండి మాటలు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే నాయకులను ఊళ్ళలోకి రానివ్వద్దని, తరిమికొట్టాలని రైతన్నలను పిలుపునిస్తున్నాను.
వడ్లను, గోధుమలను కేంద్ర ప్రభుత్వం కొంటుంది.అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను ఎందుకు కొనడం లేదు?
రైతు ఏ పంటను పండించినా దానిని ఆ ధాన్యం కనీస మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కూడా టిఆర్ఎస్ పార్టీ ధర్నా చేసింది.అయినా కేంద్రానికి ఉలుకు, పలుకు లేదు.రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు.కానీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటూ, వ్యవసాయాన్ని పండగ చేస్తున్న ఈ రాష్ట్ర రైతన్న నష్ట పడొద్దు, బాధపడొద్దు అనే ఉద్దేశంతో గత రెండేళ్లుగా కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… రైతు పండించిన పంటనంతా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు.దీనికి రైతుబిడ్డగా కేసీఆర్ గారికి రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భారతదేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం కింద రైతుబంధు మొత్తము, ఏదైనా దురదృష్టం జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలు కావద్దని రైతు బీమా వంటి రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని రైతులు వారి గుండెల్లో పెట్టుకున్నారు.ఇది గిట్టని బిజెపి… రైతులకు కెసిఆర్ గారిని దూరం చేసే కుట్రలకు పాల్పడుతూ రైతులను నష్టాలకు నెడుతుంది.
రాష్ట్ర రైతులను ఈ నష్టాల బారిన పడనివ్వనని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరికి 1960 రూపాయల కనీస మద్దతు ధర ఇచ్చి, ఊరూరా ధాన్యం కేంద్రాలు పెట్టి సేకరించాలని నిర్ణయించారు.అనేక వీళ్ళ పోరాటం తర్వాత గోదావరి నీళ్లతో ఈ ప్రాంతంలో కూడా రెండు పంటలు పండించుకునే అవకాశం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సమర్థ నాయకత్వం వల్ల ఏర్పడింది.
కానీ కళ్ళు ఉండి చూడలేని బిజెపి నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతూ… రోడ్డున పడి తిరుగుతున్నారు.ఇలాంటి వారికి సరైన బుద్ది చెప్పాలి.ధాన్యం కొనుగోలులో కేంద్రంలో ఉన్న వారి ప్రభుత్వాన్ని ఒప్పించ లేక…ఇక్కడ కెసిఆర్ గారి ప్రతిష్ట దిగజార్చే పని చేయడం బీజేపీ నేతల సిగ్గు మాలిన చర్యలకు నిదర్శనం.
ఇప్పటికైనా బిజెపి నేత బండి సంజయ్ ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎంపిలను కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని హితవు చెబుతున్నాను.
నేల విడిచి సాము చేస్తే ఉన్నవి కూడా పోతాయని హెచ్చరిస్తున్నాను.పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పత్రాలపై సంతకం చేసిన ఒక నాయకుడు ఎంపీ అయ్యాడు.
ఆదివాసీలకే రిజర్వేషన్ ఉండాలని, లంబాడీలకు రిజర్వేషన్ తీస్తానని మోసపు మాటలు చెప్పి మరొకరు ఎంపీ అయ్యాడు.ఇలాంటి ఎంపీలు జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు.
మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, టి.ఆర్.ఎస్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ భరత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా నివాళులు అర్పించారు.