వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ కు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.గత కొద్ది రోజులుగా ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తున్న లోకేష్ తాజాగా పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల మండల టిడిపి అధ్యక్షుడు బాలకోటి రెడ్డి పై హత్యాయత్నం జరిగిన ఘటనపై స్పందించారు.
మండల పరిధిలోని అలవాల గ్రామంలో బాలకోటి రెడ్డి వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఆయనపై ప్రత్యర్థులు కొంతమంది గొడ్డలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.దీంతో వెంటనే ఆయనను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడి వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.బాలకోటి రెడ్డి పై జరిగిన దాడిలో వైసీపీ నాయకుల హస్తం ఉందని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.తాజాగా ఈ ఉదంతంపై నారా లోకేష్ స్పందించారు.రాజకీయ ఆధిపత్యం కోసం మీరు చేస్తున్న దాడులు మీ రాజకీయ పట్టణానికి కారణం అవుతాయంటూ లోకేష్ హెచ్చరించారు.
బాలకోటి రెడ్డి పై జరిగిన హత్యాయత్నం లో స్వయంగా ఎంపీపీ పాల్గొన్నారని , ప్రత్యర్థులపై మీ రౌడీ మూకలు ఎంతకు తెగించాయో ఈ ఘటన రుజువు చేస్తుందని, మీ రక్తంలో ఫ్యాక్షన్ మనస్తత్వం ఉందని , అందుకే మీ పాలన రక్తసిక్తం అవుతుందంటూ లోకేష్ ఘాటుగా విమర్శించారు.

ఇప్పటికైనా హత్య రాజకీయాలను ఆపాలని, లేదంటే ఇంతకు ఇంత నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలంటూ జగన్ ను హెచ్చరించారు.అధికారం, పోలీసులు ఉన్నారని అహంభావంతో వైసిపి నాయకులు రెచ్చిపోతున్నారని , జగన్ కు ఇదే తన చివరి హెచ్చరికని వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు అంటూ లోకేష్ ప్రశ్నించారు.మేం తిరగబడాలి అనుకుంటే ఎవరు ఆపలేరని మీ వెంట వచ్చేవారు కూడా ఎవరూ ఉండరని లోకేష్ మండిపడ్డారు.







