రాబోయే ఎన్నికల్లో టిడిపి , జనసేన లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఎన్నికలకు ముందు అధికారికంగా ఈ పొత్తును ప్రకటించి సీట్ల పంపకాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీనిచ్చేది లేదు అని చెబుతూనే ఈ పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు .ఇక టిడిపి అధినేత చంద్రబాబు పవన్ ను పదేపదే కలుస్తూ పొత్తులు వ్యవహారం ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.టిడిపి జనసేన కలిస్తే కచ్చితంగా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని, ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమవుతుందని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి.

దీనికి తోడు వైసిపి అధినేత జగన్ కూడా టిడిపి జనసేన పొత్తు విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే టిడిపి జనసేన పొత్తుల తో ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే , ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే విషయంలోనూ ఆసక్తి నెలకొంది .చంద్రబాబు పవన్ లు చేరుకో రెండున్నర సంవత్సరాలు సీఎం పదవిని చేపడతారని ప్రచారం జరుగుతుంది.జనసేన కార్యకర్తలు కూడా పవన్ ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అనే ఆకాంక్షతో ఉన్నారు.గతంలోనూ పవన్ సోదరుడు నాగబాబు పవన్ ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటేనే ఏ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధం అంటూ ప్రకటించారు.

కానీ ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్రలో రాబోయే పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని, ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తారు అంటూ చెబుతుండడంతో, జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.పొత్తులతో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, పవన్ పరిస్థితి ఏమిటని ? 2014లో ఎటువంటి షరతులు లేకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు జనసేన కృషి చేసిందని, ఇప్పుడు కూడా అదే విధమైన వైఖరితో టిడిపి ఉంటే తాము ఒప్పుకునేది లేదు అంటూ జనసేన నాయకులు ఫైర్ అవుతున్నారు.ఈ విషయంలో రెండు పార్టీల అధినేతలు ఏ క్లారిటీతో ఉన్నారనేది ఎవరికి అంతు పట్టడం లేదు.







