ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం అంటూ గత పుష్కర కాలంగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఉయ్యాలవాడ కథతోనే జరగాల్సి ఉంది.కాని రీ ఎంట్రీ ప్రయోగాత్మకంగా ఉండవద్దు, కమర్షియల్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఖైదీ నెం.150 చిత్రంను చేయడం జరిగింది.ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక ఆలస్యం చేయకుండా ఉయ్యాలవాడ సినిమాను మొదలు పెట్టాలని చిరంజీవి అనుకున్నాడు.రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించాడు.150 కోట్ల బడ్జెట్ అనుకున్నారు.సినిమాను ఎక్కడ కూడా రాజీ పడకుండా తీయడంతో ఏకంగా 275 కోట్ల బడ్జెట్ అయ్యింది.విడుదలకు ముందే పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
వ్యాపారం కోసం భారత ఉపఖండంకు వచ్చిన బ్రిటీష్ వారు ఒక్కో సంస్థానంను ఆక్రమించుకుంటూ తమ పాలన కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(చిరంజీవి) సంస్థానం అయిన రేనాడును కూడా ఆక్రమించుకునేందుకు బ్రిటీష్ వారు సిద్దం అవుతారు.
తనకున్న కొద్ది పాటి సైన్యంతో బ్రిటీష్ వారిని ఎదిరించేందుకు నిలుస్తాడు.తనతో పాటు పలు సంస్థానాల పాలేగాళ్లను కూడా తనతో పాటు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేస్తాడు.ఈ పోరాటంలో ఉయ్యాలవాడ సాధించింది ఏంటీ? నర్తకి లక్ష్మి(తమన్నా)ను ప్రేమించిన నరసింహారెడ్డి ఆ తర్వాత సిద్దమ్మ(నయనతార)ను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోండి.
నటీనటుల నటన:
చిరంజీవి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఆయన ఒక గొప్ప నటుడు అవ్వడం వల్లే గత నాలుగు దశాబ్దాలుగా ఆయన్ను తెలుగు ప్రేక్షకులు ఆరాధిస్తూనే ఉన్నారు.పదేళ్లు గ్యాప్ తీసుకున్నా కూడా తన నటనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ఖైదీ చిత్రంతోనే నిరూపించుకున్న చిరంజీవి మళ్లీ ఈ చిత్రంతో తన నట విశ్వరూపంను చూపించాడు.
లుక్స్ పరంగా ఇంకాస్త బెటర్‌గా ట్రై చేస్తే బాగుండేది.కాని నటుడిగా మాత్రం చిరంజీవి పీక్స్‌లో నటించాడు.ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఈ చిత్రం కోసం ఆయన పడ్డ కష్టంను ఖచ్చితంగా అభినందించాల్సిందే.
ఇక ఈ చిత్రంలో నటించిన అమితాబచ్చన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
నయనతార మరియు తమన్నాలు ఉన్నంతలో ఆకట్టుకున్నారు.ఇద్దరు కూడా చిరంజీవికి సరి జోడీ అన్నట్లుగా నటించి మెప్పించారు.
జగపతిబాబు, కిచ్చ సందీప్‌ల నటన కూడా సూపర్బ్ అని చెప్పాలి.ఇక విజయ్ సేతుపతి నటన కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నిహారిక ఉన్నంతలో ఆకట్టుకుంది.దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతి ఒక్కరి నుండి మంచి నటన రాబట్టుకున్నాడు.
టెక్నికల్:
సినిమా విడుదలకు ముందే రెండు పాటలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఆ పాటలు థియేటర్లలో వస్తున్నప్పుడు ప్రేక్షకుల సందడి మామూలుగా లేదు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌లలో మరీ లౌడ్‌గా ఉంది.కొన్ని సీన్స్‌లో మాత్రం చాలా బాగుంది.
మొత్తంగా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది.సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉంది.
యాక్షన్ సన్నివేశాలతో పాటు భారీ సెట్టింగ్స్ ఇంకా ఆర్మీని చూపించే సీన్స్ చాలా సహజంగా ఉన్నాయి.ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలున్నాయి.
అక్కడక్కడ సినిమా కాస్త బోర్‌గా అనిపించింది.దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రీన్‌ప్లే మరియు కథ విషయంలో మంచి పట్టు సాధించి మరీ ఈ చిత్రంను తీసినట్లుగా అనిపించింది.
సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవాలి.నిర్మాణాత్మక విలువల గురించి ఎంత చెప్పినా తక్కువే.
విశ్లేషణ:
బాహుబలి చిత్రం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమపై జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగింది.దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రం మెగా ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా ప్రేక్షకులందరిని కూడా మెప్పించినట్లే.
దర్శకుడు సురేందర్ రెడ్డి కథను నడిపించిన తీరు మరియు కథలో వచ్చే ట్విస్ట్‌లతో సినిమాలో ప్రేక్షకులు లీనమై పోతున్నారు.అన్ని పాత్రలకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ కథలో ఇన్వాల్స్ చేయడంతో ప్రతి ఒక్క సీన్ కూడా కథను ముందుకు నడిపించేదిగా ఉంది.
సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆవిష్కరించే ఉద్దేశ్యంతో కొన్ని కల్పిత సీన్స్‌ను కూడా యాడ్ చేశారు.
కమర్షియల్ సినిమాలంటే ఆమాత్రం కల్పితాలు యాడ్ చేయకుంటే ప్రేక్షకులు చూడటం కష్టం.
మరీ ఎక్కువ కల్పితాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించకుండా ఎంత వరకు కావాలో అంత వరకు ఇతర ఎలిమెంట్స్ జోడిస్తూ మెయిన్ స్ట్రీమ్ మిస్ అవ్వకుండా సైరా నరసింహారెడ్డి చిత్రంను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు.కామెడీ విషయాన్ని పక్కన పెడితే ఇదో మంచి సినిమాగా చెప్పుకోవచ్చు.తప్పకుండా చూడదగ్గ చిత్రంగా నేను చెప్తున్నాను.
ప్లస్ పాయింట్స్:
చిరంజీవి,
అమితాబచ్చన్,
నయనతార, తమన్నా,
యుద్ద సన్నివేశాలు,
కాస్టింగ్,
స్క్రీన్‌ప్లే ఇంకా చాలా ఉన్నాయి
మైనస్ పాయింట్స్:
కొన్ని సీన్స్‌లో ఎడిటింగ్,
చిరంజీవి లుక్
బోటమ్ లైన్:
‘సైరా’ బాహుబలి స్థాయి మూవీ అనడంలో అనుమానం లేదు.
రేటింగ్ : 3.75/5.0