రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోనూ సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.2021-2022 ఏడాదిలో తెలంగాణలో అధికంగా ఈవీల అమ్మకాలు పెరిగాయని మంత్రి తెలిపారు.
రిజిస్ట్రేషన్, ట్యాక్స్ తదితర అంశాల్లో ఈవీ పాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు అందిస్తుండడంతో ఎలెక్ట్రిక్ వాహనాలు విక్రయాలు పెరగడానికి ఎంతో దోహదం పడుతున్నదని పేర్కొన్నారు.గత ఐదేండ్లలో వీటి విక్రయాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భారీగా పెరిగాయని మంత్రి అజయ్ అన్నారు.
గత ఏడాది రాష్ట్రంలో మొత్తం 14, 856 ఈవీల విక్రయాలు జరిగాయని అందులో టూ వీలర్స్ 13,400; త్రీ వీలర్ కార్గో వాహనాలు 349; త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాలు 113; ఫోర్ వీలర్స్ 994 విక్రయాలు జరిగాయని మంత్రి అజయ్ వెల్లడించారు.
ఈవీల టూ వీలర్స్ అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ టెన్ జాబితాలో స్థానం దక్కించుకుందని వెల్లడించారు.
ఈవీలకు రిజిస్ట్రేషన్ ఫీజును, రోడ్‌ట్యాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని ఆ రంగా పరిశ్రమలకు భారీ ఎత్తున పెట్టుబడి, పన్ను, విద్యుత్ ఛార్జీల రాయితీలను ఇచ్చిందన్నారు.పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కాలుష్యం కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.
ఈవీ మాస్టర్ క్లాసెస్ పేరుతో 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఈవీల గురించి సమగ్రంగా 3 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున శిక్షణ ఇచ్చామని దీంతో వారు ఈవీ రంగంలో సరికొత్తగా ఆవిష్కరణలు చేసేందుకు అవకాశాలు కల్పించడంతో పాటు టీ హబ్ వేదికగా స్టార్టప్‌లను ప్రోత్సహస్తున్నామన్నారు.ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.
బహుముఖ కార్యాచరణ ఫలితంగానే తెలంగాణ ఇవాళ విద్యుత్ వాహనాల రంగంలోనూ దూసుకెళ్తున్నదని రాష్ర్టాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదో ఈ ఒక్క రంగాన్ని తీసుకొని అధ్యయనం చేసినా తెలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.